Friday, 8 November 2013

కార్తీక మాసానికి ఆ పేరు ఎలా వచ్చింది?

Nerella Raja Sekhar
కార్తీక మాసానికి ఆ పేరు ఎలా వచ్చింది?

ఆయా మాసాలలో చంద్రుడు పూర్ణుడై ఏ నక్షత్రంలో ఉంటాడో ఆ నక్షత్రం పేరే ఆ మాసానికి వస్తుంది. కృత్తికా నక్షత్రంపై చంద్రుడు పూర్ణుడై ఉండటంవల్ల ఈ మాసానికి కార్తీకమాసమని పేరు. ఈ మాసంలో కృత్తి క నక్షత్రానికి, దీపారాధనకు, సోమవారాలకు ప్రాధాన్యత ఉంది.

కృత్తికా నక్షత్రం

ఈ కృత్తికానక్షత్రం నక్షత్రాలలో మంచి ప్రాముఖ్యత ఉంది. దేవతలలో ప్రథముడైన అగ్నిదేవుడు ఈ నక్షత్రానికి అధిపతి. అగ్ని నక్షత్రాలైన కృత్తిక, ఉత్తర, ఉత్తరాషాడలలో మొదటిది కృత్తికయే. వేదకాలంలో సంవత్సరం కృత్తికా నక్షత్రంతోనే ఆరంభమయ్యేది. ఈ నక్షత్రాన్ని అగ్ని నక్షత్రమని అంటారు. అగ్ని ఆరు ముఖాలు కలవాడు. కృత్తికలు కూడా ఆరు నక్షత్రాలు. ఈ కృత్తికలు ఒక విశిష్టత ఉంది. అదేమిటంటే కుమార స్వామిని షణ్ముఖుడు అంటారు. అంటే ఆరు ముఖములు కలవాడని అర్థం. ఆకాశంలోని ఆరు కృత్తికా నక్షత్రములు మాతృమూర్తులై పాలు యివ్వగా కుమారస్వామి ఆరు ముఖాలతోపాలు త్రాగాడు. ఈ విధంగా కృత్తికలచే పెంచబడుటచే కుమరస్వామికి కార్తీకేయుడని పేరు వచ్చినది. ఈ కారణాల వల్ల కృత్తికలకు ప్రాముఖ్యం కలిగినది.

కార్తీక సోమవారాలు

ఈ మాసవారాలలో సోమవారానికి ప్రత్యేకత ఉంది. సోమవారానికి చంద్రుడు అధిపతి. దేవతలలో ప్రథముడైన అగ్నినక్షత్రాలలో మొదటిదైన కృత్తికను అధిపతిగా ఉండటం, చంద్రుడు పూర్ణుడై ఈ నక్షత్రం మీద ఉండటం చేత మాసంలోని సోమవారాలకు విశిష్టత కలిగినది. చంద్రుని వారమైన ఈ సోమవారం శివునికి ఎంతో ప్రీతికరమైనది. శైవభక్తులు ఈ మాసంలో ముఖ్యంగా సోమవారాలలో భక్తిశ్రద్ధలతో నియమనిష్టలతో శివుణ్ణి ఆరాధిస్తారు.

ఏ మనుష్యూడైనను తులారాశియందు సూర్యుడుండగా కార్తీకమాసమందు సూర్యోదయ కాలమునకు లేచి కాలకృత్యంబులు నిర్వర్తించి, నదీస్నాన మొనరించి, జపము, దేవపూజ, తీర్థవిధి మొదలగు కార్యములను జేసినచో గొప్ప ఫలంబు సంప్రాప్తించునని యుందురు. సూర్యుడు తులారాశి యందు ప్రవేశించిన నాటి నుండిగాని, కార్తీక మాసారంభదినమగు శుద్ధపాడ్యమి మొదలుకొనిగాని వ్రతారంభమును చేయవలయును.అట్లు ప్రారంభించు సమయ మున ఓ కార్తీక దామోదార! నీకు వందనములు. నాచే నారంభింపబడు కార్తీక వ్రతంబును విఘ్నము లేకుండ జరు గునట్లు చేయుము అని పిమ్మట స్నానము చేయవలెను.