శమ్యాప్రాసము
నిప్పుకణికను నెత్తిమీద పెట్టినప్పుడు దానిని త్రోసివేయడానికై మనిషి ఎంత అల్లాడి పోతాడో చూడండి. మాయకు తాను బానిసగా ఉన్నానన్న నిజం తెలుసుకొన్న వ్యక్తి కూడ బంధవిముక్తికై అంతగా పరితపిస్తాడు. ఒక విద్యార్థి, ఒక రైతు, ఒక వ్యాపారి, ఒక ఉద్యోగి, ఒక నేత, ఒక సన్యాసి, ఒక గ్రుహస్థు, ఒక పోలీసు, ఒక జవాను, ఒక రైతు కూలి, ఒక శ్రామికుడు (యజమాని, పనిచేసేవాడు), ఒక రాయబారి, ఒక కళాకారుడు, ఒక గ్రుహిణి, ఒకతండ్రి, ఒక కొడుకు, ఒక అల్లుడు, ఒక కోడలు, ఒక మంత్రి, ఒక కార్యదర్శి, ఒక పురోహితుడు, ఒక రిక్షావాల, ఒక డ్రైవరు, ఒక పాకీ మనిషి, చెప్పులు కుట్టేవాడు, బట్టలు కుట్టేవాడు, ఒక ఉపాధ్యాయుడు, ఒక రచయిత ... ఇలా ఎందరో అందరూ నేను ఈశ్వర ప్రేరిత కార్యం చేస్తున్నాను, ఇది నిజంగా భగవంతుడు నాకు అప్పగించిన పని, దీనిని నేను నిస్వార్థంగా చేస్తున్నాను, దీని ద్వారా నేను -- నా వాళ్లు జీవిస్తున్నాము, అనే భావనతో చేయాలి. ఆ పని నిజమైన యోగమవుతుంది. అతడు జీవన్ముక్తుడు అవుతాడు. నిస్వార్థ కర్మయే ముక్తి అన్నారొకచోట స్వామి వివేకానందులు. ఈ పనులు చేస్తూ కొందరు, చేయకుండా కొందరు దొంగలవుతారు, వ్యభిచారులవుతారు, హింసా కర్ములవుతారు, పొగరుబోతులవుతారు, త్రాగుబోతులవుతారు, లంచగొండులవుతారు, ఆస్తులు పెంచుకొంటారు, దీనహీన పీడిత తాడితుల్ని ఆణిచివేస్తారు, కొందరిని బానిసలుగా చేసుకొని వెట్టిచాకిరి చేయించుకొంటారు, న్యాయంగా ఒకరికి చెందాల్సిన సొమ్ముని తన వాళ్లకు దోచిపెడతారు, దాచి పెడతారు, అర్థానికి - స్త్రీకి - పదవికి బానిసలై మతాలు మారుతారు, సేవల పేరిట మోసం చేస్తారు, తల్లిదండ్రులను పట్టించుకోకుండా ఇంద్రియాలకు బానిసలై తిరుగుతారు, అధికారం నిమిత్తం ప్రత్యర్థుల గొంతుకోస్తారు; తమదికాని భూమిని ఆక్రమిస్తారు, పైకి సత్యవంతులు, లోన తేనెపూసిన కత్తులు, విషపుతిత్తులు, గోముఖవ్యాఘ్రాలు, పయోముఖ విషకుంభాలు, మేకవన్నెపులులు ... ఇటువంటి వారందరు మాయలో పడ్డట్టే, ఇది మాయ అని తెలుసుకొని నెత్తిన పడిన నిప్పుకణికను ఎలా వెంటనే తొలిగిస్తామో, అలా మాయను తొలగించాలి అంటున్నారు స్వామి వివేకానందులు. నిప్పుకాలుతుంది, మాయ కూడ కాలుస్తుందని గ్రహించాలన్నమాట. ... ఆచార్య కసిరెడ్డి, శివానంద భారతి.