Sunday, 3 November 2013

కార్తీకమాసము


హైందవ సంస్కృతి మాస పత్రిక
కార్తీకమాసము
మాసాలలో అత్యంత పవిత్రమైనది కార్తిక మాసము. శివ కేశవులకిద్దరికీ ప్రీతికరమైనది .ఏంతో మహత్యము కలది. కార్తీక మాసములో సూర్యుడు తులా సంక్రమణములో నుండగా ఆచరించె స్నాన , దాన , జప,పూజాదులు విశేష పలితాలనిస్తాయి. సూర్యుడు తులారాశిని ప్రవేశించగానే గంగానది ద్రవ రూపము ధరించి సమస్త నదీ జలాలలోనికి చేరుతుంది. కాబట్టి ఈ నెలలంతా నదీ స్నానము చేస్తే శరీరము , మనసు రెండూ పవిత్రమవుతాయి . నదులు దగ్గరలేక పోతే చెరువులో , వాగులో , ఏవీ దగ్గర లేకపోతే కనీసము ఇంటిలోనైనా సూర్యోదయానికి ముందే " గంగేచ యమునే చైన గోదావరి సరస్వతి ! నర్మదే సింధు , కావేరీ జలెస్మిన్ సన్నిధిన్ కురు " అనే శ్లోకాన్ని పఠిస్తూ తలస్నానము చేసి నిర్మల హృదయము తో భగవదారాధన చేయాలి.
కార్తీకమాసము ముప్పై రోజులు పర్వదినాలుగా భావించి నదీ స్నానాలు , వుపవాసాలు , సాయంత్రము కాగానే ఇంటి ముందు దీపాలు వెలిగించటము , స్త్రీలు దీపాలను నదిలో వదలటము ,వనభోజనము చేయటము , వివిధ దానాలను , ముఖ్యముగా దీప దానము , సాలంకృత కన్యాదానము చేయటము మొదలైనవి నిర్వహిస్తారు. ఈ మాసము లో ఉపనయన దానము ,కన్యాదానము చాలా పలితమిస్తుంది .భక్తి తో సాలంకృత కన్యా దానమిచ్చినట్లు ఐతే అన్ని పాపాలు తొలిగిపోయి పితృదేవతల యొక్క స్తానాన్ని ,బ్రహ్మ పదాన్ని పొందుతారంటారు. దశమి ,ఏకాదశి ,ద్వాదశి తిధులలో శ్రీమహావిష్ణువును తులసిదళాలతోనూ , కమలపూల తోనూ పూజిస్తే జీవించినన్నాళ్ళూ ధనానికి లోటులేకుండా వుండి , సమస్త సౌఖ్యాలు కలగటముతో పాటు అంత్యమున జన్మరాహిత్యము కలుగుతుందట. అదేవిధముగ ఆరుద్ర నక్షత్రము రోజున , మాస శివరాత్రినాడు , సోమవారమునాడు , కార్తీక పున్నమి నాడు రుద్రాభిషేకం చేసి , బిల్వదళాలతోనూ , రుద్రాక్షల తోనూ పూజించినవారికి అనంతమైన సౌఖ్యాలతోబాటు అంత్యమున శివసాయుజ్యము పొందుతారని కార్తీకపురాణం చెబుతోంది ...