Sunday, 3 March 2013

కాశ్యప గోత్రము :- హిందూ సమాజములో "సాంప్రదాయములలో గోత్రము యొక్క ప్రాధాన్యత" అపరిమితమైనది. ముఖ్యంగా పెళ్ళిళ్ళు చేసేటప్పుడు, వధూ వరులకు రాశి, నక్షత్ర, గోత్ర పొంతనలను చూస్తారు. మఱి ఎవఱికైనా 'తమ యొక్క గోత్రము తెలీదనుకోండి. అప్పుడేమి చేయాలి ? అలాంటప్పుడు ఈ క్రింద ఉటంకించిన శ్లోకమును చెప్పుకోవలెను. అనగా తమది కాశ్యప గోత్రమని చెప్పుకోవచ్చును.

శ్లో. గోత్రత్వస్యాఽపరిజ్ఞానే! కాశ్యపం గోత్రముచ్యతే |
యస్మాదాహ శ్రుతిః పూర్వం ప్రజాః కశ్యప సంభవాః||

తాత్పర్యము :- ప్రజలు కశ్యపుని వలన జన్మించినారు అని శ్రుతివాక్యము.

కశ్యప ప్రజాపతి :- కశ్యప మహర్షి, మన ఖండములలో "ఆది పురుషుడు" అని భావించవచ్చును. దక్షిణ ఆసియా దేశాలలో - మూల స్తంభము. అనాది మనిషి, నాగరికత అభివృద్ధి చెందే దశలలోని ప్రజలకు మార్గదర్శకత్వము వహించినాడు. ఈ పైన చూపిన శ్లోకము అందుకు ముఖ్య ఆధారము.

కశ్యప కుటుంబము :- సృష్టికర్త బ్రహ్మ మరీచి అనే మహర్షిని సృజించెను. ఆ మరీచి భార్య పేరు కళ. ఈమె కర్దమ ప్రజాపతి కుమార్తె. వారికి జన్మించినవాడే కశ్యపుడు. కర్దమ ప్రజాపతి మాతామహుడు. కావున ఈతని మధ్యవర్తిత్వముచే కశ్యప ఋషి వివాహమైనది. దక్ష ప్రజాపతి తన కుమార్తెలు పదమువ్వుఱిని - కశ్యపునికి ఇచ్చి వివాహమొనరించెను. అలాగే వైశ్వానరుని తనయలు ఇఱువుఱు కశ్యపుని అర్ధాంగీ పదవులను పొందినారు. 15 మంది సతులతో కూడి, జీవితమును నియమబద్ధముగా గడుపుచూ క్రమముగా ఆ మునివరుడు సమాజ సుస్థిరతకు అవసరమైన నియమావళిని రూపొందించే ప్రయత్నాలను చేసెను. ఆతని సంతానము తామరతంపరగా వర్ధిల్లి, మానవుని ఉనికి ప్రవర్ధమానమైనది. మానవుని సుఖ జీవనమునకు నీరు ముఖ్య ఆధారము గనుక, కశ్యపుడు సంఘ నిర్మాణమునకు నదీ, సముద్ర తీరములను ఎంచుకుని ఆ అన్వేషణలో సఫలీకృతుడైనాడు. తద్వారా “కశ్యప ప్రజాపతి”గా ప్రజల అభిమానమును పొందినాడు.

వివిధ ప్రాంతముల ఉనికిని కనుగొన్న ఋషిసత్తముడు :- నీల మత పురాణములో కశ్యప మౌని గుఱించిన అనేక అంశములకు ఆధారములు లభించినవి. కాశ్మీరమునకూ, కశ్యపునికీ అవినాభావ సంబంధము కలదు. “కశ్యప మీర దేశము” పరిణామములో “కాశ్మీరము” ఐనది. నేటి వ్యావహారిక నామము “కాశ్మీర్”. కశ్యప = కూర్మము, మధుపాన మత్తుడు అనే అర్ధాలు ఉన్నవి. శ్రీకూర్మము అంటే తాబేలు - భూమిపైనా, జలములలోనూ జీవించే ఉభయ చర ప్రాణి. కశ్యపుడు - ఇటు పృధ్వీతలము పైనా, అటు నీటిలోనూ నిర్భీతిగా సంచరించగల శక్తిసామర్ధ్యాలు కలిగి ఉన్నట్టి వ్యక్తి.

అంబుధికి ముని పేరు :- నదీ తీరములు, జలనిధులు మిక్కిలిగా ఉన్న సీమలలో 'ప్రజా సంఘముల ఏర్పాటుకు' పునాదులను వేశాడు కశ్యపుడు. తటాకాది జలాశయములు మనిషికి జీవనాధారములై, నాగరికతలు నవ్య నవీనముగా రూపొందే దశలకు శ్రీకారము చుట్టాడు తాపసి కశ్యపుడు. కశ్యప మహాఋషి సంచార జీవనములో కనుగొని, ప్రజా జీవనమునకు పూలబాటలను పరిచాడు. కనకనే అవి ఆ మునీశ్వరుని నామముతో వినుతికెక్కినవి. కశ్యప + మీర = కాశ్మీరము/ కాశ్మీరదేశము. కశ్యప సముద్రము = అనగా నేటి కాస్పియన్ సాగరము, సప్త మహా సముద్రాలలో ఒకటి Darya -I - Kaspyan. (Kashyap sagar - caspian sea