Sunday, 17 March 2013

భీష్ముడి పూర్వజన్మ


భీష్ముడి పూర్వజన్మ

http://jagannaatakam.blogspot.in/2007/03/blog-post_21.html

ఆపుడు, ధ్రువుడు, సోముడు, ధరుడు, అనిలుడు, అనలుడు, ప్రత్యూషుడు, ప్రభాసుడు అష్టవసువులు. భీష్ముడు గతజన్మలో అష్టవసువుల్లో ఆఖరివాడైన ప్రభాసుడు. ఒకసారి అష్టవసువులు లోకవిహారం చేస్తూ వశిష్ఠుడి ఆశ్రమానికి వస్తారు. అప్పుడు వశిష్ఠుడు ఆశ్రమంలో లేడుగానీ కామధేనువు పుత్రిక నందిని వుంది . ప్రభాసుడు తన భార్య ప్రేరేపించగా తన సోదరుల సాయంతో నందినిని తస్కరిస్తాడు. వశిష్ఠుడు తిరిగొచ్చాక వాళ్ళు చేసిన పని చూసి ఆగ్రహించి వాళ్ళు ఎనిమిది మందీ మనిషి జన్మ ఎత్తుతారని శపిస్తాడు. అప్పుడు మిగిలిన ఏడుగురు వసువులూ తప్పైపోయింది క్షమించమని ఆ మహర్షిని వేడుకోగా ప్రభాసుడొక్కడే తలబిరుసుతో ఆయన్ను తూలనాడుతాడు. దాంతో ఆ ముని వాళ్ళేడుగురికీ మనుషులుగా పుట్టగానే శాపవిమోచనమౌతుందని, ఎనిమిదోవాడు మాత్రం దీర్ఘకాలం కఠినతరమైన మానవ జీవితం గడపవలసి ఉంటుందని శాపాన్ని సవరిస్తాడు. 


ఇది జరగడానికి పూర్వం ఇక్ష్వాకు వంశానికి చెందిన మహాభిషువు అనే రాజొకడు తన పుణ్యఫలం చేత బ్రహ్మలోకం చేరుతాడు. కానీ అక్కడ నిండు సభలో గంగాదేవిని మోహంతో మైమరచి చూస్తాడు. అది గమనించిన బ్రహ్మ కోపించి అతడిని భూమ్మీద మానవజన్మ ఎత్తమని శపిస్తాడు. అతడు ఆ శాపఫలితంగా భూమ్మీద కురువంశంలో శంతనుడై అవతరించగా గంగ అతడి మీద మోహంతో అతణ్ని వెతుక్కుంటూ వస్తూ ఉంటుంది. ఆమెకు దారిలో అష్టవసువులు దీనవదనులై కనిపిస్తారు. ఆమె వారి దు:ఖానికి కారణమడుగగా వాళ్ళు ఆమెకు విషయం వివరిస్తారు. అప్పుడు ఆమె వారికి బెంగపడవద్దని, తాను కూడా భూలోకానికే వెళ్తున్నానని చెప్పి, అక్కడ వాళ్ళు తన కడుపున పుట్టేటట్లు, వాళ్ళు ఒక్కొక్కరూ పుట్టిన వెంటనే శాపవిమోచనం కలిగించేట్లు అనుగ్రహిస్తుంది. అలా అటు అష్టవసువుల శాపవిమోచనం జరగడంతో బాటు ఇటు శంతనుడికి ఒక వారసుడు మిగులుతాడు. అతడే భీష్ముడు. (శాపవశాన మానవజన్మెత్తిన శంతనుడికి పూర్వజన్మస్మృతి లేదు. కానీ తనంతట తాను భూలోకానికి వచ్చిన గంగకు మాత్రం గతంలో జరిగిన విషయాలన్నీ చక్కగా జ్ఞాపకమున్నాయి.) తర్వాత జరిగిన కథ అందరికీ తెలిసిందే !