లోపాముద్ర
http://jagannaatakam.blogspot.in/2007/03/blog-post_12.html
1. ఈమెకు కౌశీతకి అని, వరప్రద అని పేర్లున్నాయి. రుగ్వేదంలో కూడా ఈమె ప్రస్తావన ఉంది. అగస్త్య మహామునికి ఈమె భార్య. అగస్త్యుడు ఒకసారి ఒక బావిలో తలకిందులుగా వేలాడే తన పితృదేవతలను చూశాడు. వాళ్ళు అతడి కారణంగానే తామలా ఉన్నామని, అతడు పెళ్ళి చేసుకుని కొడుకును కనేంత వరకు తమకు ఉత్తమగతులు కలగవని చెప్పారు. అప్పుడతను పెళ్ళి చేసుకోదలచి తనకు భార్య కావలసిన స్త్రీని సృష్టించడం కోసం లేడి నుంచి కన్నులు,... ఇలా సృష్టిలోని ఉత్కృష్టమైన అందాలన్నిటినీ పోగుచేశాడు. ఆమె కోసం తమ అవయవాలనిచ్చిన జీవుల శరీరాల్లో ఆ లోపాలు ముద్రలుగా మిగిలిపోయాయి. అందుకే ఆమె పేరు లోపాముద్ర ఐంది. అగస్త్యుడు విదర్భరాజు సంతానం కోసం చేసే యాగానికి వెళ్ళి లోపాముద్రను విదర్భరాణి గర్భంలో ప్రవేశపెట్టాడు. లోపాముద్ర అపురూప లావణ్యవతి (డిజైనర్ బేబీ కద?). అగస్త్యుడు ఆమెకు యుక్తవయసు వచ్చాక వెళ్ళి ఆమెను పెళ్ళాడగోరాడు. ఆమె తల్లిదండ్రులు మొదట ఒప్పుకోలేదు. కానీ ఆమే స్వయంగా అగస్త్యుణ్ణి వరించి పెళ్ళాడి ఆయనతోబాటే నిరలంకారంగా ఆశ్రమంలో ఉంటుంది. అగస్త్యుడు పెళ్ళిచేసుకున్నాడేగానీ కొడుకును కనాలన్న విషయం మర్చిపోయి మళ్ళీ యథాప్రకారం తన జపతపాల్లో పడిపోయాడు. ఒకసారి ఆమె స్నానం చేసి వస్తూఉండగా చూసి మర్చిపోయిన విషయం గుర్తొచ్చి నాలిక్కరచుకున్నాడు. ఐతే సంతానవతి కావడానికి ఆమె ఒక కోరిక కోరింది. "మీ దినచర్యలో ఒక ఋషిపత్నిగా నేను పాలు పంచుకుంటున్నాను. కానీ శృంగారం విషయంలో నేనొక రాకుమారిని. యువరాణికి తగిన ఆభరణాలు, రాజోచితమైన పాన్పు ఉంటేనే తప్ప వీలుపడదు." అని చెప్పేసింది. అగస్త్యుడు తన దగ్గర ధనం లేదనేసరికి తనకున్న ఆధ్యాత్మికశక్తులను వినియోగించమని సలహా ఇచ్చింది. అగస్త్యుడు ఆమెను సంతోషపెట్టడానికి శ్రుతర్వరాజును ఆభరణాలు అడిగాడు కానీ వాటిని తీసుకోవడానికి ఒక అసాధారణ నియమం విధించాడు. దాంతో ఆ రాజు ఆయన్ను ముందు వ్రధ్నాశ్వుడనే రాజు వద్దకు, తర్వాత త్రసదస్యుడనే రాజు దగ్గరకు తీసుకుపోయాడు. ఆ త్రసదస్యుడు అగస్త్యుడికి ఇల్వలుడనే వాణ్ణి గురించి చెప్పాడు. అగస్త్యుడు ఇల్వలుడి ఆతిథ్యాన్ని స్వీకరించి అతడి తమ్ముడైన వాతాపిని జీర్ణం చేసుకుని ధనరాశులను తీసుకుని వచ్చి లోపాముద్రను సంతోషపెట్టాడు. ఆమె ఏడేళ్ళు గర్భం ధరించి గుణవంతుడైన కొడుకును కంది. అతనే ధృఢాశ్వుడు లేక ఇధ్మవహుడు. భర్తతో కలిసి ఆమె లలితసహస్రనామ ప్రాశస్త్యాన్ని చాటింది.
2. దధీచి భార్య. ఈమె గర్భవతిగా ఉండగా ఆయన దేవతలకు ఆయుధాలివ్వడానికి అగ్నికి ఆహుతయ్యాడు. ఆమె కూడా చితిప్రవేశం చేయబోయి, గర్భస్థ శిశువు కోసం ఆగిపోయింది. ఒక పిప్పల వృక్షం కింద శిశువును ప్రసవించి చితిప్రవేశం చేసింది. అతడే పిప్పలాదుడు. ఈమె మరోపేరు సువర్చ.
3. కవేరుడనే ఋషిపుత్రిగా విష్ణుమాయ పుట్టింది. ఆమె తపస్సు చేసి ఒక అంశ లోపాముద్రగా, మరో అంశ కావేరి నదిగా రూపొందింది.
4. పూర్వజన్మలో ఒక బ్రాహ్మణుడు. త్రిపురసుందరి అనుగ్రహం వల్ల పురుషత్వం పోయి దేవిరూపం గల స్త్రీగా మారాడు. అగస్త్యుడు ఆమెను కోరాడు. ఆమె దేవిని ఉపాసించమంది. హయగ్రీవుడి కృప వల్ల అగస్త్యుడు త్రింశతి, శ్రీవిద్యల ఉపదేశం పొందాడు.