Monday 16 April 2012


తర్పణం వదిలే నువ్వులు,నీళ్ళు మొదలగునవి చనిపోయినవారికి ఎలా చేరుతాయి?

ఈ కర్మలలో నువ్వులు,నీళ్ళు మొదలగునవి వదులుతారు కదా? మరి అవి చనిపోయినవారికి ఎలా చేరుతాయి అనే సందేహము వస్తుంది. బ్రతికిఉన్నవారికి ఏమైనా ఇస్తే వాళ్ళు పుచ్చుకొంటారు. మరి చనిపోయినవారికి ఎలా అందుతాయి?
ఒక చిన్నకథ ద్వారా దీనిని అర్థం చేసుకోవచ్చు.

ఒక పెద్దమనిషి తన కుమారుణ్ణి చదవటానికి పట్టణంలో వదలి పెట్టినాడు. ఆ పిల్లవాడు పరీక్షకు డబ్బుకట్ట వలసి వచ్చింది. వెంటనే తండ్రికి నీవు డబ్బును మని యార్డరు చేయవలసినదని కోరినాడు. కుమారుడు అడిగిన డబ్బు తీసుకొని తండ్రి తపాలా ఆఫీసుకు వెళ్ళినాడు. ఈ పెద్దమనిషి ఒక పల్లెవాడు,అమాయకుడు. డబ్బును తంతీ(Telegram) ఆఫీసు ఉద్యోగికి అప్పచెప్పి దానిని పంపవలసిన దని కోరినాడు- తంతుల ద్వారా ఆ డబ్బు ఉద్యోగి పంపుతాడని, ఆ అమాయకుడు అనుకొన్నాడు. ఉద్యోగి డబ్బును తీసి, మేజాలో భద్ర పరచి, సరే పంపుతాను'- అని అన్నాడు. 'నే నిచ్చిన డబ్బు నీదగ్గరే వుంచుకొన్నావే ? అది మా వాడికి ఎట్లా పోయి చేరుతుంది?' అని అతని ప్రశ్న. 'ఎట్లా చేరుతుందా? ఇదో ఈ విధంగా' అని అతడు టెలిగ్రాఫ్ మీద తంతిని పంప సాగినాడు. డబ్బు ఇక్కడే వున్నదే? ఇతడేమో పోయి చేరుతుంది అని అంటున్నాడే. ఇదెట్లా సాధ్యం? అని పల్లెటూరి వాని సందేహం సందేహంగానే నిలచిపోయింది. మనియార్డరు మాత్రం పిల్లవానికి సురక్షితంగా పోయి చేరింది.

మనం పితరులకూ(అంటే చనిపోయినవారికి), దేవతలకూ అర్పించే వస్తువులు కూడా ఈ విధంగానే చేరవలసిన చోటుకుపోయి చేరుతాయి. శాస్త్రసమ్మతంగా మనం ఈ క్రియలను నిర్వర్తిస్తే పితృదేవతలు అవి ఎవరికి పోయి చేరవలయునో వారికి చేరేటట్లు చూస్తారు. ఒకవేళ చనిపోయినవారు ఆసరికే ఎక్కడో జంతువులుగానో లేక మనుషులుగానో లేక మరే విధముగానో పుట్టిఉంటే వారికి ఆహారరూపములోనో లేక మరే ఉపయోగకరమైన వస్తువుల రూపముగానో వారికి చేరుతాయి. ఈ విధంగా వస్తువులను తగిన రూపంలో చేరవేయటానికి వలసిన స్తోమతను పితృ దేవతలకు భగవంతుడుఇచ్చి వున్నాడు. అందు చేత శ్రాద్ధంలో మనము అర్పించే వస్తువులను స్వీకరించే దానికి వాళ్ళు ప్రత్యక్షంగా రావలసిన పనిలేదు.

శ్రాద్ధము అనగా శ్రద్ధతో చేయవలసిన క్రియ అని అర్థము.
ఒక ఉత్తరం వ్రాసి దాన్ని పోష్టు చేయబోతూ " ఈ తపాలాపెట్టె (పోష్టుబాక్సు) అందముగాలేదు, నా వద్ద ఇంతకంటే మంచి పెట్టె ఉంది. అందులో వేస్తాను" అని అనుకొంటే ఆ ఉత్తరం చేరవలసిన వారికి చేరుతుందా? అందుచేత మనం ఏ పని చేయాలన్నా మనము సఫలము కావాలి అనుకొంటే వాటివాటి విధులను పాటించాలి. పెద్దలు అందులకే 'యథాశాస్త్రం, యథావిధి' అన్నారు. కర్మ సఫలం కావాలంటే శాస్త్రవిధులను పాటించక తప్పదు.