Friday, 3 January 2014

రుద్రాక్షలు - ఫలితాలు .....

Satya Kumar Venkata Nelanuthala
రుద్రాక్షలు - ఫలితాలు .....

'ఏకముఖి' రుద్రాక్ష చాలా అరుదుగా లభిస్తుంది. జీడిపప్పు ఆకారంలో వుండే ఈ రుద్రాక్షను ఆవుపాలతో శుద్ధి చేసి ధరించాలి. 'శివ' స్వరూపంగా చెప్పబడుతోన్న ఈ రుద్రాక్ష సిరి సంపదలను ... సుఖ శాంతులను ప్రసాదిస్తుంది.

'ద్విముఖి' రుద్రాక్ష కోరిన కోరికలను నేరవేర్చు కల్పవృక్షం వంటిది. అర్ధనారీశ్వర స్వరూపమైన ఈ రుద్రాక్ష, అకాల మృత్యువును అడ్డుకుంటూ ఆధ్యాత్మిక శాంతిని ... ఏకాగ్రతను కలుగజేస్తుంది.

'త్రిముఖి' రుద్రాక్ష కుజ దోషాలను నివారిస్తుంది. అగ్నిదేవుడి స్వరూపమైన ఈ రుద్రాక్ష, వివాదాలను దూరం చేయడమే కాకుండా, దీర్ఘాయువునిస్తుంది.

'చతుర్ముఖి' రుద్రాక్ష సకల పాపాలను హరించుటలో ప్రధానపాత్ర పోషిస్తుంది. బ్రహ్మదేవుడి స్వరూపమైన ఈ రుద్రాక్ష, విద్యావంతులను చేస్తుంది. బుద్ధి బలాన్ని ... తేజస్సును పెంచి ప్రజల ఆదరాభిమానాలను చూరగొనేలా చేస్తుంది.

'పంచముఖి' రుద్రాక్ష విష జంతువుల బారిన పడకుండా కాపాడుతుంది. కాలాగ్ని స్వరూపమైన ఈ రుద్రాక్ష, శత్రు బాధలను తొలగించి సుఖశాంతులను ప్రసాదిస్తుంది.

'షణ్ముఖి' రుద్రాక్ష బ్రహ్మ హత్యా దోషాల నుంచి బయటపడేస్తుంది. కుమారస్వామి స్వ రూపమైన ఈ రుద్రాక్ష, విద్య ... వ్యాపారాలను అభివృద్ధి పథంలో నడిపిస్తుంది.

'సప్తముఖి' రుద్రాక్ష లేమి అనేది లేకుండా చేస్తుంది. సప్త మాతృకలు .. సప్తరుషులు ... లక్ష్మీ ... మన్మధ స్వరూపాలుగా ఈ రుద్రాక్షను భావిస్తుంటారు. ఇది అకాల మృత్యువును నివారించడమే కాకుండా, శని దోషాలని తొలగిస్తుంది.

'అష్టముఖి' రుద్రాక్ష ఆయుషును పెంచుతుంది. వినాయకుడి స్వరూపమైన ఈ రుద్రాక్ష, ప్రయోగ పూర్వకమైన మంత్ర తంత్రాలను పారకుండా చేస్తుంది. విద్యా సంబంధమైన విషయాల్లో రాణించేలా చేస్తుంది.

'నవముఖి' రుద్రాక్ష యమ భయం లేకుండా చేస్తుంది. భైరవ ... కపిలముని స్వరూపమైన ఈ రుద్రాక్షకి అధిష్ఠాన దేవత దుర్గాదేవి కాబట్టి, నవ శక్తుల అనుగ్రహం కలుగుతుంది.

'దశముఖి' రుద్రాక్ష భూత ప్రేత పిశాచ బాధలను తొలగిస్తుంది. విష్ణు స్వరూపమైన ఈ రుద్రాక్ష, అన్ని గ్రహాల అనుగ్రహంతో కోరిన కోరికలను తీర్చే కామధేనువు వంటిది.

'ఏకాదశ ముఖి' రుద్రాక్ష పదకొండుమంది రుద్రుల స్వరూపం. ఈ రుద్రాక్షను ధరించిన పురుషులకు విజయం, స్త్రీలకు సంతానం కలుగుతుంది.

'ద్వాదశ ముఖి' రుద్రాక్ష లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కలిగిస్తుంది. సూర్యుడికి ప్రతీకగా చెప్పుకునే ఈ రుద్రాక్ష, వ్యాధులను నివారించడమే కాకుండా దారిద్ర్యపు బాధలను సైతం తొలగిస్తుంది.

'త్రయోదశ ముఖి' రుద్రాక్ష సకల శుభాలను ప్రసాదిస్తుంది. ఇంద్రుడి స్వరూపమైన ఈ రుద్రాక్ష, కామధేనువులా కోరిన కోరికలు తీరుస్తుంది.

'చతుర్దశ ముఖి' రుద్రాక్ష సమస్త పాపాలను హరించి వేస్తుంది. శివ పార్వతుల రూపంగా ... హనుమంతుడి స్వరూపంగా చెప్పుకునే ఈ రుద్రాక్ష, సర్వ వ్యాధులను నివారిస్తుంది.