Sunday 1 September 2013

పూజలకు ఉపయుక్తములగు వివిధ సామాగ్రులలో కేవలము పత్రము, పుష్పము,ఫలము, జలములను పేర్కోనుటలోని ఆంతర్యము - సామాన్య మానవులకు సైతము ఎట్టి శ్రమగాని, హింసగాని, వ్యయముగాని, లేకుండా సులభముగా లభించు ఏ వస్తువునైనను భగవదర్పణచేయవచ్చు. - అను విషయమును తెల్పుటకే. ఈ సందర్భమున ఒక విషయం మననం చేసుకుందాం. 
12 ఏండ్లు వనవాసము, ఒక ఏడు అజ్ఞాత వాసము, పూర్తి చేసిన పాండవులు తమ రాజ్యభాగమును తమకిమ్మని దుర్యోధనుని అడుగగా దానికతడు పూర్తిగా నిరాకరించెను. పాండవుల పక్షమున శ్రీ కృష్ణుడు దూతగా కౌరవులకడకేగెను. బయట మిక్కిలి శిష్టాచారుని వలే కనబడుటకై దుర్యోధనుడు ఆయనకు ఆడంబరముగా స్వాగత సన్నాహములను నెరపెను. అతడు భోజనమునకాహ్వానింపగా భగవానుడు అందులకు నిరాకరించెను. దుర్యోధనుడు కారణమడుగగా భగవానుడు ఇట్లు చెప్పెను. 
""సంప్రీతి భోజ్యాన్యన్నాని, ఆపద్భోజ్యాని వా పునః!
న చ సంప్రీయసే రాజన్ న చైవాపద్గతా వయమ్!! (ఉ. పర్వం - 91/25)
భుజించుటకు రెండు కారణములు ఉండును. ప్రేమ గలచోట ఏది సమర్పించినను అది తృప్తికరముగనే యుండును. లేదా ఆకలికి నకనకలాడు వానికి ఎదుటివాడు ఏ భావముతో ఏది సమర్పించినను దానితో ఆ ఆకలిని తీర్చుకొనవలసియే వచ్చును. ఇచట ఈ రెండు కారణములు లేవు. మీలో నాపై ప్రేమలేనే లేదు. నేను ఆకలిగొనియును లేను." అని పల్కి పిలుపుతో పనిలేకయే విదురునింటికి పోయెను. భీష్మ పితామహుడు, ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు, మొదలగు పెద్దలు విదురునింటికి వెళ్లి తమ ఇంటికి రమ్మని శ్రీ కృష్ణుని ఆహ్వానించిరి. కాని భగవానుడు ఎవ్వరి ఇండ్లకు వెళ్ళలేదు. విదురుని ఇంటిలోనే అతడు భక్తితో సమర్పించిన పదార్ధములను ప్రేమతో స్వీకరించి అతనిని కృతార్ధుని చేసెను. దుర్యోధనుని విందును తిరస్కరించి, విదురుని౦ట పప్పుపులుసులను ఆరగించి "భక్తి కలుగు కూడు పట్టెడైనను చాలు" అని మనకు తెలియజెప్పెను.