Tuesday 10 September 2013

ఋషి పంచమి (9/10/2013 Tuesday)

Brahmasri Chaganti Koteswara Rao Garu.
ఋషి పంచమి (9/10/2013 Tuesday)

భాద్రపద శుద్ధ పంచమిని ఋషి పంచమిగా వ్యవహరిస్తారు. ఆరోజున అత్రి, కశ్యప, భరద్వాజ, గౌతమ, వశిష్ట, విశ్వామిత్ర మహర్షుల గురించి ఒక్కసారైనా తలచుకోవాలని చెబుతారు పెద్దలు. అరణ్యవాసంలో సీతారాములకు అభయమిచ్చినవాడు అత్రి మహర్షి. సాక్షాత్తూ శ్రీహరినే పుత్రునిగా పొందిన మహానుభావుడు. సీతారాములకు చిత్రకూటానికి దారి చూపినవాడు భరద్వాజ మహర్షి. తన భార్య అహల్య ద్వారా రామునికి తన తప:ఫలాన్ని అందింపజేసిన మహారుషి గౌతముడు. రాముని గురువు విశ్వామిత్రుడు. కులగురువు వశిష్టుడు. విష్ణువు అంశావతారమైన పరశురాముని కన్న తండ్రి జమదగ్ని మహర్షి. దశావతారాల్లో ఒకటైన వామనుడి జనకుడు కశ్యపమహర్షి. రుషిపంచమినాడు రామాయణం చదివితే ఈ మహర్షులందరినీ తలుచుకున్నట్టే.

ఆ మర్నాటి షష్ఠిని సూర్యషష్ఠిగా వ్యవహరిస్తారు. ఆరోజున సూర్యుని ఆరాధిస్తే మంచిదని నమ్మిక. అష్టమినాడు కొన్ని ప్రాంతాల స్త్రీలు కేదారవ్రతం చేస్తారు. ఇక దశమినాడు విష్ణుభక్తులు దశావతార వ్రతం ఆచరిస్తారు. నారాయణుడు వామనుడిగా అవతరించిన దినం భాద్రపద శుద్ధ ద్వాదశి. ఆరోజున శ్రవణా నక్షత్రం కూడా వస్తే మరింత ప్రశస్తం అని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి.

ఈ మాసంలో శుద్ధ చతుర్దశిని అనంత పద్మనాభ చతుర్దశి అంటారు. ఈరోజున పాలకడలిపై మహాలక్ష్మీసమేతుడై శేష తల్పశాయిగా కొలువైన శ్రీమహావిష్ణువును పూజించడం ఆచారం. తిరువనంతపురం లోని అనంతపద్మనాభస్వామి వ్రతం ఆచరించడం వల్ల దారిద్ర్యం తొలిగి ఐశ్వర్యం లభిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం.