Monday 5 August 2013

Brahmasri Chaganti Koteswara Rao Garu.
శివుని 8 పేర్లు - అష్టపుష్ప మానస పూజ
మహాగ్రంథాలు - శ్రీ శివ మహాపురాణము

అట్టి శ్రీ సదాశివమూర్తికున్న ఎనిమిది పేర్లనూ అర్ధసహితంగా వివరిస్తున్నాను...

1. శివాయనమః = అన్నటికీ శుభము కలిగించువాడా! నీకు ఇదే నా నమస్కారం!

2. మహేశ్వరాయనమః = సంధాన - తిరోధాన కర్తవైన నీకు నమస్కరించుచున్నాను.

3. రుద్రాయనమః = సర్వ ఆపదలను నివారించువాడవైన నీకు అంజలి.

4. విష్ణవేనమః = సర్వే సర్వత్రా వ్యాపించియున్న వాడవైన నీకు నా కైమోడ్పులివియే!

5. పితామహాయనమః = అన్నిటికీ మూలకారకుడైనవాడా! నీకు ఇదే నా నమస్కారం!

6. సంసార భిషజేనమః = సమస్త ప్రాపంచిక రుగ్మతలనూ దూరం చేసే వైద్యుడైన వాడా! అంజలి.

7. సర్వజ్ఞాయనమః = అన్నీ తెల్సినట్టి మహా విద్వన్మూర్తీ! నమస్కృతులు. నా నమస్సుమాంజలి!

8. పరమాత్మాయనమః = అన్నిటికీ అతీతుడైనట్టి భగవంతుడా! ఇదే నా నమస్సుంజాలి!

పైన చెప్పిన మొదటి ఐదు నామాలూ ఇహసాధనకు - ఆ పిదప మూడు నామాలూ పరసాధనకు తారక మంత్రాలవంటివి.

ఇక...మానస పూజారాధకులకు అష్టపుష్పపూజ అనేది ఉన్నది.

అష్టపుష్ప మానస పూజ:

శ్లో. అహింసా ప్రథమం పుష్పం - పుష్పమింద్రియ నిగ్రహః
సర్వభూతదయా పుష్పం క్షమా పుష్పం విశేషత ||
శాంతి పుష్పం, తపః పుష్పం - ధ్యాన పుష్పం తథైవచ
సత్య మష్టవిధం పుష్పం - శివ ప్రీతికరం భవేత్‌ ||

(శివా! ఈ పుష్పాష్టకంతో నీవు సంతృప్తుడవయ్యెదవు గాక! అహింస, ఇంద్రియచాపల్యరాహిత్యం, అన్ని ప్రాణుల పట్ల దయ, కష్ట నష్టాలను భరించగలిగే ఓర్పు, అన్నిటినీ సమానంగా చూసే నిర్మల శాంత గుణం, నిరంతర తపం, నిత్య ధ్యానం, నిజం చెప్పే గుణం...వీటితో నిన్ను మానసికారాధన చేయుదును.)

అనగా - ఈ గుణాలు ఎవరిలో వుంటాయో వారు వేరే పూజలేవీ చేయనక్కర్లేదు. తమ గుణాలద్వారానే, శివపూజ వారు చేస్తున్నట్లేనని భావం!

ద్యాన రీతులు :

సర్వకాల సర్వావస్థలయందునూ శివ ధ్యానం చేస్తూండాలి. శివమూర్తులు ధ్యానపరంగా మూడు విధాలు -

1. ఘోరమూర్తి

2. మిశ్రమూర్తి

3. ప్రశాంతమూర్తి

ఘోరమూర్తి ఆరాధన = తక్షణ ఫలప్రదం

మిశ్రమూర్తి ఆరాధన = కొద్దికాలంలో ఫలవంతం

ప్రశాంతమూర్తి ఆరాధన = అంత్యమున మోక్షప్రాప్తి.

ఇక.. ధ్యానం 2 రకాలు. అవే సవిషయ నిర్విషయ పూర్వకాలు.

సవిషయం = సాకారోపాసన

నిర్విషయం = నిరాకారోపాసన

రెండూ సక్రమ యోగ మార్గాలే.