Monday 5 August 2013

శ్రీ గాయత్రీ మాత మంత్రార్ధం మహత్వం వివిధ పురాణాల్లో,

హైందవ సంస్కృతి మాస పత్రిక
గాయత్రీం చింతయేద్యస్తు హృత్మద్మే సముపస్థితామ్
ధర్మాధర్మ వినిర్ముక్త స్పయాతి పరమాం గతిం

సర్వవేదాత్మ స్వరూపమైన శ్రీ గాయత్రీ మాత మంత్రార్ధం మహత్వం వివిధ పురాణాల్లో, పలువురు ఋషుల చేత వర్ణించబడింది.

1. స్కాంధ పురాణం: మన బుద్ధిని అంతర్యామి రూపంలో కర్మలయందు ప్రేరేపించు వానిని ధ్యానించెదము. అంటే సర్వజీవులందు ప్రత్యక్షాత్మ రూపంలో ఉన్న, విభిన్న నామాలు కల సూర్యస్వరూపుడైన, ఆ పరమేశ్వరుని ఉపాసిస్తున్నాము.

2. బ్రహ్మ పురాణం: భూ, స్వర్గ, అంతరిక్ష లోకముల నుండి వెలువడు తేజస్వరూపుడైన ఆదిత్యుడే, సర్వదేవాత్మక పరమాత్మ, బ్రహ్మ, విష్ణు, మహేశ్వర రూపుడైన సూర్యుని ఉపాసించుచున్నాము.

3. సాయణాచార్య వివరణ: సర్వాంతర్యామి అయిన ‘సవిత’ తేజస్వరూపుడై, జగత్ స్ర్సష్టయై, పరమేశ్వరుని ఆత్మభూతుడై, అవిద్యను, కాలకార్యాలను భర్జించువాడై, భర్గుడై, స్వయం జ్యోతి స్వరూపుడై, పరమాత్మ యొక్క తేజస్సై, సర్వులకూ ప్రత్యక్ష దైవమై, అందరి బుద్ధిని కర్మకై ప్రేరేపించి, పాపాలను భస్మం చేయు, తేజోమండలాతర్గతుడైన సవితృనిధారణ చేస్తున్నాము.

4. ఆదిశంకరుల వివరణ : సమస్తాన్ని ప్రకాశించ చేయునది, చిర్రూపమైనది, సర్వాధిక ప్రధికతమైన సుఖరూపమై, సర్వసాక్షియై, అంతఃకరణ ప్రకాశితమైనది ప్రత్యగాత్మ, ఆత్మస్వరూపమై, నిరతిశయానందరుపమై, అవిద్యను నశింపచేయు జ్ఞానదీప్తియై, రసస్వరూపమైన, శుద్ధ చైతన్య స్వయం ప్రకాశరూపమైన, అందరి బుద్ధులను సత్కర్మాచరణకై ప్రేరేపించు ప్రత్యగాత్మను ధ్యానిస్తున్నాను.

5. భరద్వాజ వివరణ: సమస్త ప్రాణులను సృష్టిమ్చగల, సూర్యమండల స్థితమైన, అనుపమ తేజస్సు ప్రార్ధించదగినది, ఉపాసించదగినది. ఆదిత్యుని యందలి హిరణ్మయ పురుషుని, అతని తేజస్సును, మా బుద్ధిని శ్రేయస్కర కార్యాచరణకై ప్రేరేపించుటకు ప్రార్ధిస్తున్నాము.

6. ఉద్బట వేదాచార్యులు: ఏ సవితృ భగవానుడు, మాక్రియా బుద్ధులను, వాక్కులను, శుభ, ధర్మ, కర్మాదులందు ప్రేరేపించునో, ఆ దేవత యొక్క తేజస్సును ధ్యానము చేయుచున్నాము.

7. గోపథ బ్రాహ్మణము : ఏ సూర్యుడు, మమ్ము ఉదయాన మేలుకొలిపి, కర్మలయందు ప్రేరేపించి, నడిపించుచున్నాడో, ఆ దేవుడు మాకు ఆధారమగుటకై ప్రార్ధించుచున్నాము.

8. శథపథ బ్రాహ్మణము : శతపథ బ్రాహ్మణంలో గాయత్రీ మంత్ర వైశిష్ట్యం భోగ మోక్ష విద్యగా వర్ణించబడింది. ప్రజాపతి అంటే కాలంలో సంవత్సర స్వరూపుడు. 12 పూర్ణిమలు, 12 అమావాస్యలు కలిసి 24 అక్షరాలుగా మంత్రం ఏర్పడింది. మనకు కాలాలు మూడు. వేసవి, వర్ష, శీతాకాలాలు. దీనిని అనుసరించి పాదానికి ఎనిమిది అక్షరాల చొప్పున 24 అక్షరాల త్రిపాద గాయత్రి కూర్చబడిందని వర్ణన చేయబడింది. ఆదిత్య మండలాంతర్గతుడైన ‘సవిత్’ అన్నిలోకాలపై ఆధిపత్యం వహిస్తూ లోకత్రయాత్మక ప్రాణబ్రహ్మ అయి, మా బుద్ధులను ప్రేరేపించు పరంబ్రహ్మమును ఉపాసించుచున్నాము.

9. మైత్రావరుణ్యుపనిషత్తు : చైతన్యస్వరూపుడైన సవితృదేవుడు, కార్యప్రవర్తకుడై, మా యందు మంచి బుద్ధులను ప్రేరేపించుగాక.

10. అనంత భట్టు భాష్యం : ఏ పరమేశ్వరుడు అంతర్యామియై, మా జ్ఞానేంద్రియములను, కర్మేంద్రియములను, మంచి పనులు చేయుటకై ప్రేరేపించి, సర్వ సంసార కష్టములను భర్జించు సామర్ధ్యము కల తేజః స్వరూపుడైన సవితృని ధ్యానించుచున్నాము.

11. భట్టోజీ దీక్షిత్ భాష్యం : మా యొక్క బుద్ధులను మంచిపనులను చేయుటకై ప్రేరేపించువాడు, ప్రకాశించెడి ఆదిత్య తేజమే నేనని, అట్టి దానికి దాసుదనని భావించుచూ ఇపాసించుచున్నాను.

12. బహ్వృచ సంధ్యా పద్ధతి భాషం : సూర్యమండలమందు సవితృ అను నామముతో ఉండి, సేవించు వారి కష్టములు దహింపచేయు, భర్గుడనిపించుకొను నారాయణుడే మా బుద్ధులను కార్యాచరణకై ప్రేరేపించును కనుక ఆ సవితృ దేవుని పూజించుచున్నాము.

శ్రీ గాయత్రీ మంత్ర విశిష్టతను గురించి మహాఋషులు, యోగులు, మహాత్ములు తమ తమ అభిప్రాయాలను వెల్లడించారు. వారిలో కొందరి అభిప్రాయాలను తెలుసుకుందాం.

1. విశ్వామితృడు - గాయత్రి మంత్రంతో సమానమైన మంత్రం నాలుగు వేదాలలో లేదు.
2. యాజ్ఞవల్కుడు - గాయత్రీ మంత్రం సర్వశ్రేష్టం. సర్వోపనిషత్ సారం.
3. పరాశరులు - సమస్త జప, సూక్త, వేదమంత్రాలలో అత్యున్నతమైనది గాయత్రీ మంత్రం.
4. శౌనకుడు - ఎన్ని ఉపవాసాలు చేసినా, బంధ విముక్తి చేయగల శక్తి కలది గాయత్రీ మంత్రం మాత్రమే.
5. వశిష్టులు - ఎంతటి దుర్మార్గుడైనా, మపలచిత్తుడైనా, గాయత్రీ మంత్రోపాసన ఫలితంగా, సర్వోన్నత పదవిని పొందగలడు.
6. వేదవ్యాసులు - సకల వేదసారం గాయత్రీ మంత్రం, సిద్ధగాయత్రీ కామధేనువు వంటిది. గాయత్రీ రూపమైన బ్రహ్మగంగ ఆత్మప్రక్శాళన చేస్తుంది.
7. అత్రి - ఆత్మను శోధించు పరమమంత్రం గాయత్రీ మంత్రం. గాయత్రీతత్వాన్ని గ్రహించువారు సర్వసుఖాలు పొందగలరు.
8. భరద్వాజ - త్రిమూర్తులు కూడా తరించటానికి గాయత్రిని ఉపాసిస్తారు. గాయత్రీ మంత్ర జపం వల్ల పరంబ్రహ్మ సాక్షాత్కారం లభిస్తుంది.
9. నారద మహర్షి - భక్తి స్వరూపమే గాయత్రి. ఎక్కడ గాయత్రి ఉపాసించబడునో అక్కడ శ్రీమన్నారయణుడు ఉంటాడు.
10. రామకృష్ణ పరమహంస - మంత్రం చిన్నదైనా శక్తి మహత్తరం. అనేక సాధనలు విడిచి గాయత్రిని ఉపాసించండి, సిద్ధుల్ని పొందగలరు.
11. స్వామి రామతీర్ధ - గాయత్రి మనిషిని కామరుచి నుండి మరలించి, రామరుచిలో లగ్నం చేస్తుంది. ప్రవిత్రాంతఃకరణతో అనుష్టించిన రాముని పొందగలరు.
12. స్వామి వివేకానంద - గాయత్రీ మంత్రం సమృద్ధి మంత్రం. అందుకే మకుటమంత్రమన్నారు.
13. శ్రీ రమణ మహర్షి - గాయత్రీ మంత్రశక్తి వలన అద్భుత ఫలాలు చేకూరతాయి. ఐహిక, లౌకిక, పారమార్ధిక ఫలాలు లభిస్తాయి.
14. స్వామి శివానంద - బ్రహ్మ ముహూర్తంలో గాయత్రీ మంత్రోపాసన వల్ల హృదయనైర్మల్యం, చిత్తశుద్ధి, శారీరక ఆరోగ్యం లభిస్తాయి. నమ్రత్వం, దూరదృష్టి, స్మరణశక్తి లభిస్తాయి.
15. దయానంద సరస్వతి - గాయత్రీ మంత్రం సర్వోత్కృష్ట శ్రేష్ట మంత్రం. చతుర్వేదాలకు మూలమైన మంత్రం.
16. శ్రీ అరవిందులు - గాయత్రిలో నిక్షిప్తమైన శక్తి, మహత్వపూర్ణకార్యాన్ని సాధిస్తుమ్ది.
17. శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణన్ - మనలో పునః జీవన స్రోతస్సును ప్రభావింపచేయగల సార్వభౌమిక ప్రార్ధనే గాయత్రీ మంత్రం.

అనేక ధార్మిక గ్రంథాలు గాయత్రీ మహిమను ప్రస్తుతించాయి. ఎందరో మహానుభావులు, ఈ మహత్తర మంత్రంలోని గుప్తమైన శక్తులను, గూఢరహస్యాలను గుర్తించి, ఉపాసించి ఫలసిద్ధి పొందారు... హైందవ సంస్కృతి మాస పత్రిక సౌజన్యంతో....