ద్వైత, అద్వైతాల సంగమమే భక్తి జ్ఞానము
సాధకావస్థలో ఉన్నప్పుడు భక్తి, జ్ఞాన మార్గాల నడుమ లోతైన అగాధమున్నట్లు పైకి కనిపిస్తుంది. అందుచేత భక్తులకూ, జ్ఞానులకూ మధ్య ఘర్షణలు తఱచు. ఈ ఘర్షణలు తీవ్రతరమై మన మతంలో ద్వైత, అద్వైత విశిష్టాద్వైత శాఖలు పుట్టుకొచ్చాయి. ద్వైతులు విశిష్టాద్వైతులు భక్తివాదులు. అద్వైతులు జ్ఞానవాదులు. అద్వైతుల పరమగురువు ఆదిశంకరులు.విశిష్టాద్వైతుల పరమగురువు శ్రీమద్రామానుజులు. వారివలెనే శ్రీ మధ్వాచార్యులు కూడా ద్వైతులే. “దేవుడూ, జీవుడూ ఎప్పటికీ వేఱువేఱే”నంటారు ద్వైతులు. “ఇద్దఱూ ఒకటే”నంటారు అద్వైతులు. భగవద్గీతలో, “నా భక్తుడైనవాడే నాకు ప్రియతముడు (యో మే భక్త స్స మే ప్రియః)” అన్న భగవానుడే జ్ఞానికి కాస్త పెద్దపీట వేస్తూ, “జ్ఞానికీ, నాకూ భేదమే లేదని నేను భావిస్తున్నాను (జ్ఞానీత్వాత్మైన మే మతమ్)” అని కూడా చెప్పాడు. మఱోచోట, ఆ భగవానుడే “ఈ ఇద్దఱి కంటే కూడా యోగాభ్యాసియే గొప్పవా”డని తేల్చాడు. తొలిచూపులో ఇదంతా గందరగోళంగా ఉంటుంది. కానీ పరమార్థదృష్ట్యా మూడూ ఏకీభవిస్తాయనేదే గీతాకారుడి హృదయం కావచ్చు.
జ్ఞానవాదులకు (అద్వైతులకు) భక్తుల చేష్టలన్నీ వెఱ్ఱిమొఱ్ఱి వ్యవహారాలుగా, పిల్లకాయతనంగా తోస్తాయి. స్థావర జంగమాలన్నింటిలోనూ ఆత్మ ఉండగా, ఆ ఆత్మే పరబ్రహ్మై ఉండగా, దానికో ప్రత్యేకమైన పేరూ, ఆకారమూ కల్పించి, మిగతా ఆత్మల నుంచి దాన్ని వేఱుగా భావిస్తూ దాన్ని మాత్రమే పూజించడం వారికి మూర్ఖత్వంలా అగుపిస్తుంది. మానవుడు తనలోనే ఉన్న సర్వశక్తిమంతమైన ఆత్మను దర్శించలేని అంధుడై, బాహ్యప్రపంచంలో తన నెత్తిమీద దేవుడి పేరుతో అనవసరంగా ఒక యజమానుణ్ణి కల్పించుకొని నానా తీర్థక్షేత్రాల్లో ఆయన్ని వెతుకుతూ, ప్రార్థనలూ, స్తోత్రాలూ, శరణాగతి అనుకుంటూ తలబాదుకుని ఏడవడం, నానా కోరికలు కోరడం, దాన్ని భక్తిగానూ, మోక్షమార్గంగానూ భావించడం చూసి వారి పెదవులు పరిహాస స్ఫోరకమైన దరహాసాన్ని అలవోకగా ఒలికిస్తాయి.
జ్ఞానుల మార్గమూ భక్తులకు అంతే అభ్యంతరకరంగా, బహుశా అంతకంటే ఎక్కువ అభ్యంతరకరంగా గోచరిస్తుంది. అది వారికి మిట్టవేదాంతంగా, దేవుడి పట్ల జీవుడికి గల విధ్యుక్త ధర్మాన్ని నిర్వర్తించకుండా ఎగవేస్తున్న బాధ్యతారాహిత్యంగా, నాస్తికతానిర్విశేషంగా కనిపిస్తుంది. ముఖ్యంగా, దేవుడూ, జీవుడూ ఒకటేనన్న సిద్ధాంతాన్ని వారు దైవధిక్కారంగానూ, ద్రోహంగానూ జమకడతారు. కనీసం అవాస్తవికమైన అతిశయోక్తిగా, మిథ్యావాదంగా నైనా చూస్తారు. భగవంతుడికి పూజా, సేవా, స్తోత్రమూ చేయకుండా మనిషి ఓ మూల ముక్కుమూసుకుని ధ్యానం పేరుతో తన గుఱించి తాను చింతన చేస్తూ కూర్చున్నంత మాత్రాన అతనికి పుణ్యమెలా వస్తుందో, అతను సద్గతులకెలా వెళతాడో అర్థం కాక వారు విడ్డూరంతో ముక్కుమీద వేలేసుకుంటారు.
వాస్తవమేంటంటే – జ్ఞానంతో మనిషికి ఏ స్థితి కలుగుతుందో అదే భక్తితోనూ కలుగుతుంది. లేదా భక్తితో అతడు ఏ స్థాయికి వెళతాడో జ్ఞానంతోనూ అదే స్థాయికి వెళతాడు. నిజాయితీ గల జ్ఞానమార్గం భక్తికీ, అనన్యమైన భక్తిమార్గం జ్ఞానానికీ దారితీస్తాయి. విషయాల లోతును తఱచి తఱచి, పట్టి పట్టి, తెలుసుకుంటూ, తెలుసుకుంటూ సస్పృహం (conscious) గా మనిషి సాధించే మనఃపరిశుద్ధినీ, అరిషడ్వర్గాలపై గెలుపునీ భక్తుడు భక్తిలో మునగడం ద్వారా, అలా మనస్సుని వాటి నుంచి భగవంతుడి వైపు సంపూర్ణంగా త్రిప్పుకొని వాటియందు అభిరుచిని కోల్పోవడం ద్వారా అస్పృహం (uncounscious) గా సాధిస్తాడు. జ్ఞాని తారతమ్యవిచారణ ద్వారా చేసే అన్ని త్యాగాల్నీ, భక్తుడు శరణాగతి ద్వారా, “ఇది భగవంతుడి కోసం, లేదా ఇది భగవంతుడి సంకల్పం” అనుకుంటూ చేయగలుగుతాడు. జ్ఞాని సమాధిస్థితి ద్వారా సాధించే విశ్వాత్మభావాన్ని భక్తుడు భగవద్భావనతో తాదాత్మ్యం చెందడం ద్వారా సాధిస్తాడు. జ్ఞాని ప్రయత్నపూర్వకంగా అభ్యసించే అద్వైతభావాన్ని భక్తుడు అందఱినీ దైవదూతలుగా భావించడం ద్వారా కైవసం చేసుకుంటాడు. జ్ఞాని యోగాభ్యాసం ద్వారా అలవఱచుకునే ప్రాణాయామాన్ని భక్తుడు భక్తిపారవశ్యంలో మునగడం ద్వారా సహజంగా సాధిస్తాడు. జ్ఞాని నిదిధ్యాసనం చేసీ చేసీ హృదయవైశాల్యాన్ని పెంపొందించుకోవడం ద్వారా అందుకునే మనోమార్దవాన్ని భక్తుడు స్వాభావికమైన ప్రేమార్ద్ర్దభావం ద్వారా చేఱుకుంటాడు.
నిజాయితీ గల సత్యాన్వేషణతో కూడుకొన్న జ్ఞానమార్గం బహుక్లిష్టమైనది. ప్రపంచాన్ని ప్రయోగశాలగా, జీవితాన్ని ప్రయోగవస్తువుగా, ఈ జన్మే తనకున్న ఏకైక అవకాశంగా, తన మనస్సే తన ఏకైక సాధనంగా, కొలమానంగా భావిస్తూ, గ్రహించిన ప్రతివిషయాన్నీ ఆచరణ అనే అగ్నిపరీక్షకు లోనుచేస్తూ నానా గుంటల్లో, గోతుల్లో పడుతూ లేస్తూ ఉండగా గమ్యానికి చేర్చేది జ్ఞానమార్గం. అందుకు చాలా నేర్పూ, ఓర్పూ, ధైర్యసాహసాలూ కావాలి. ఈ క్రమంలో మనిషి మొద్దుబాఱిపోతాడు. రాటుదేల్తాడు. అయినా సత్యాన్ని కనుగొనాలనే ఏకైక ఆశయమూ, తదేకనిష్ఠా అతని హృదయమార్దవ సౌరభాన్ని ఇగరనివ్వకుండా కడకంటా నిలబెడతాయి. ఇహపోతే నిక్కమైన భక్తిమార్గమూ కష్టమైనదే. దీనిక్కూడా చాలా గుండెనిబ్బరం కావాలి. “ఏం జఱిగినా భగవత్సంకల్పమే. అంతా నా మేలుకే జఱిగింది. భగవంతుడు ఏం చేసినా నా చిరంతన శ్రేయస్సును గమనంలో ఉంచుకునే చేస్తాడు. ఆయన నాకెప్పుడూ అన్యాయం చేయడు. మంచి జఱగనీ, చెడు జఱగనీ, అది ఎంతటిదైనా కానీ, చలించకుండా ఆయనకు సర్వదా విధేయుణ్ణయి, ఆయన లీలలకు తలవంచి మనసా వాచా కర్మణా స్వీకరించడమే నా పని. ఆయన్ని నేను ప్రశ్నించను. సవాళ్ళూ విసరను. ఆయన మార్గంలోంచి ఎప్పటికీ వైదొలగను. ఆయన్ని శాసించడం నా పని కాదు. నా బలమంతా ఆయనే. నాకు సంబంధించిన అన్ని విషయాలూ ఆయనే చూసుకుంటాడు” అనుకుని అనన్యంగా, నిర్ణిబంధంగా మనసారా భగవంతుణ్ణి ప్రేమించగల ఈ సర్వసమర్పణ భావుకమైన మనోఽవస్థ బహు జన్మజన్మాంతరాల పుష్కల పుణ్యరాశి చేత గానీ సిద్ధించేది కాదు. సుఖపడాలనుకునేవారు ఒక్కపూట కూడా ఈ త్రోవ త్రొక్కలేరు.
భక్తికి మూలం ప్రేమే. ఆ ప్రేమని మానవుడు భగవంతుడి వైపు మళ్ళించినప్పుడు దాన్ని భక్తి అంటున్నాం. ప్రేమకూ, జ్ఞానానికీ ఉన్న సంబంధం నిగూఢమైనది. ఒకటి రెండో దానికి దారితీస్తుందని పలువుఱు ఎఱగరు. ఒక వస్తువును లేదా విషయాన్ని మనం ఎంతగా ప్రేమిస్తామో అంతగా అది తన గుఱించిన రహస్యాల్ని మనకు కాలక్రమంలో వెల్లడిస్తుంది. మానవ విజ్ఞానమంతా అలా ఉద్బుద్ధమైనదే కదా ! అలాగే ఒక విషయం గుఱించి, లేదా వ్యక్తి గుఱించి మనకు ఎంత బాగా తెలిస్తే అంతగా దాని/ అతని పట్ల ప్రీతి జనిస్తుంది. లోకంలో ఇతరులందఱికీ ద్వేషపాత్రుడైన వ్యక్తి అతని కుటుంబానికి మాత్రం ప్రేమాస్పదుడు కావడం ఇందువల్లనే. అతని సౌహార్ద కోణాల్ని అతని కుటుంబం ఎఱుగును. ఇతరులెఱగరు. అంతే తేడా. పక్షాంతరంలో – మనం ఒకఱి గుఱించి ఎంతగా అజ్ఞానంలో ఉంటామో అంతగా అతన్ని ద్వేషిస్తాం. జ్ఞానం పెఱిగే కొద్దీ ద్వేషం మాయమై దాని స్థానంలో ప్రేమ జనిస్తుంది. తమ బండిని గుద్దిన వ్యక్తి తమ బాల్యస్నేహితుడేనని తెలిస్తే బండిని పక్కన పారేసి కౌగలించుకుంటారు. కళ్ళు కనిపించని బాలింత పులి తన పిల్లలు తన పిల్లలేనని తెలీకా, గుర్తుపట్టలేకా వాటిని తింటుంది. కాబట్టి జ్ఞానం = ప్రేమ ; అజ్ఞానం = ద్వేషం.
మనుషులు ‘భాష’ అనే సంకేతాల వ్యవస్థ ప్రకారం మాత్రమే ఆలోచించడం, ఆ చట్రంలోనే ఇతరుల్ని అర్థం చేసుకో యత్నించడం వల్ల ఈ రకమైన అపార్థాలూ, ఘర్షణలూ ప్రబల్తాయి. ఒకఱికొకఱు అర్థం కాక వేఱువేఱు పదజాలాలతో వేఱువేఱు సిద్ధాంతాల్ని వండివార్చి, వాటి కనుయాయిల్ని కూడా సమకూర్చుకుని తరతరాల యుద్ధాలు చేస్తూంటారు. ఇది పాండిత్యాన్ని కాక స్వానుభవ దూరతనే సూచిస్తుంది. స్వానుభవం మినహా వేఱే నిరూపణ లేని ఆధ్యాత్మిక విషయాల్ని వ్యక్తీకరించడానికి ప్రత్యక్ష భౌతికవాస్తవాల పరో॑ఽక్ష దూతలాంటి మానవభాష అసమర్థమైనది. ఎందుకంటే ఎంత హృద్యమైన పండితశైలికైనా మూలభూతమైనది ఒకనాటి పామరభాషే. అంటే, ఒకప్పటి అనాగరిక పామరుల భాషే మారుతూ మారుతూ, మనదాకా వచ్చి ఈనాటి భాషగా రూపుదాల్చింది. అటువంటి నీచ పామరత్వ మూలాలు గలిగిన భాషలోకి పరిణతి చెందిన మానవాత్మ యొక్క మహోన్నత దివ్యానుభవ శిఖరాల్ని యథాతథంగా అనువదించడం అసాధ్యం. అసలు ఆత్మికానుభవాలు మఱీ పెద్దమాటేమో ! కనీసం శృంగార అనుభవాన్నైనా భాష యథాతథంగా వ్యక్తీకరించజాలదు.
కనుక ఆధ్యాత్మిక మార్గంలో నడవదల్చుకున్న ప్రతివారూ ముందస్తుగా అభ్యసించాల్సింది భాషకతీతంగా ఉండడం. అంటే భాషలో కాకుండా భావాలతో మాత్రమే ఆలోచించడం. అదే పద్ధతిలో ఇతరుల్ని కూడా అర్థం చేసుకోవడం. ఉదాహరణకు - మనలో ఊహాశక్తి హెచ్చిన కొద్దీ మన మనోవ్యాపారాల్లో భాష పాత్ర క్షీణిస్తూ పోతుంది. భాష మనల్ని ఇతరులకు వ్యక్తీకరించుకోవడానికి ఉద్దేశించినటువంటిది. కనుక మనిషి భాషకు బద్ధుడు కావడం ద్వారా దాని శ్రోతైన సంఘానికి బద్ధుడైపోతాడు. అంటే, “సంఘానికి ఏం చెబితే, ఎలా చెబితే తన భావాలకు ఆమోదయోగ్యత లభిస్తుందా ?” అనే నిరంతర చింతలో పడిపోతాడు. కాబట్టి మన ఆలోచనల్లోంచి సంఘాన్ని ఎంతగా బహిష్కరిస్తామో, అంటే సంఘపు లంకెని ఎంతగా త్రెంచుకుంటామో, అంతగా మనం మన అంతరాత్మకు దగ్గఱవుతాం. అంతగా మనం భాషకు అతీతులమవుతాం. భాషనీ, శైలినీ బట్టి మనుషులకు కొలమానం వేసే అలవాటు మానుకోవడం ద్వారా యథార్థమైన లోతుల్లోకి చొఱబడే ప్రతిభ అలవడుతుంది. ఆ విధంగా కూడా మనం భాషకు అతీతులమవుతాం.
భక్తిమార్గం సంకుచితత్వంతోనూ, జ్ఞానమార్గం శంకలతోనూ మొదలవుతాయి. కానీ అక్కడే చిక్కుపడిపోవు. యోగంలో పరాకాష్ఠ నందుకున్న తరువాత కూడా అరుదుగా మనిషి పతనం చెందే అవకాశం ఉంటుందేమో గానీ, నిక్కమైన జ్ఞానాన్ని గానీ, పరాభక్తిని గానీ ప్రాపించిన తరువాత మనిషి తిరిగి సామాన్యుడయ్యే ఆస్కారమే లేదు. లేదు గాక లేదు. దీని గుఱించే గీతలో, “ఏషా బ్రాహ్మీ స్థితిః పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి” అన్నాడు భగవంతుడు. ఒక మాట. జ్ఞానమార్గంలో సాగినా, భక్తిమార్గంలో సాగినా అదంతా భగవత్సంకల్పమే తప్ప తన ఇచ్ఛ కాదు. ఎందుకంటే జ్ఞానానికి మంచి శరీర దార్ఢ్యమూ, తర్క వితర్క నైపుణ్యమూ, బుద్ధికుశలతా, శిక్షణా ఉండాలి. భక్తికి హృదయమార్దవమూ, ప్రేమార్ద్రభావమూ కావాలి. ఇవన్నీ ఆ భగవంతుడే ఇవ్వాలి. మనం అలవాటు చేసుకోబోతే అబ్బేవి కావు. దీనికి తోడు ఏ మార్గంలో గమ్యాన్ని చేఱుకోవాలన్నా ఆ మార్గానికి చెందిన గురువరేణ్యులు తారసిల్లడమూ, వారి శుశ్రూషా, కృపా అత్యావశ్యకం. “ఇహ ఏ పుస్తకాలూ చదవనక్కఱలేదు. ఏ సత్సంగమూ అవసరం లేదు” అన్న స్థితికి వచ్చినప్పుడే గమ్యానికి చేఱుకున్నట్లు. జ్ఞానులూ, భక్తులే నిజమైన వీరులు.