Thursday, 16 May 2013


అధిక మాసము , క్షయ మాసము ( మల మాసము )


అధిక మాసము , క్షయ మాసము ( మల మాసము ) 

      ఈ సారి భాద్రపద మాసమునకు అధిక మాసము వచ్చింది . ఇది రేపటి నుండీ ఆరంభమవుతుంది . అధికమాసమనగా యేమి , అధిక మాసములో యేమి చేయవచ్చును , యేమి చేయరాదు మొదలగునవి ఇక్కడ వివరించడమయినది 

అధిక మాసమును అర్థంచేసుకొనుటకు ముందు సౌర మాసము , చాంద్రమాన మాసము లను గురించి తెలుసుకోవలెను . 

     సౌర మాసము :  రెండు పక్క పక్క సంక్రమణములు మధ్య కాలమునే ఒక సౌర మాసము అంటారు . సంక్రమణమనగా , సూర్యుడు ఒక రాశిని వదలి , తరువాతి రాశిని ప్రవేశించు సమయము . కాబట్టి , సూర్యుడు ఒక రాశిలో ఎంత కాలముంటాడో ఆ అవధి ఒక సౌర మాసము . సౌరమాసపు పేరు , సూర్యుడున్న రాశిపేరుతోనే పిలుస్తారు . ఉదాహరణకు , మేష మాసము , వృషభ మాసము ..ఇలాగ. 

     సూర్యుడి చలనపు వేగము దినదినమూ మారుచుండుట వలన అన్ని సౌర మాసములందూ కాలావధి ఒకటేగా ఉండదు . హెచ్చుతగ్గులు ఉండును . సంవత్సరానికి పన్నెండు సౌర మాసాలుండును . 

     చాంద్రమాన మాసము : రెండు అమావాశ్యల , లేదా రెండు పౌర్ణముల మధ్య కాలమును చాంద్రమాన మాసము అంటారు . అమావాశ్య , / పౌర్ణమి ముగిసినపుడు మాసము కూడా ముగుస్తుంది . అమావాశ్యను గణనకు తీసుకుంటే దానిని  ’ అమాంత మాసము ’ అనీ , పౌర్ణమిని గణనకు తీసుకుంటే దానిని ’ పౌర్ణిమాంత మాసము ’ అంటారు . 

     గుజరాత్ , మహారాష్ట్ర , కర్నాటక , కేరళ , తమిళనాడు , ఆంధ్ర ప్రదేశ్  మరియు బెంగాల్ లలో అమాంతమూ , మిగిలిన రాష్ట్రాలలో పౌర్ణిమాంతమూ వాడుక లో ఉంది .

     అధిక మాసము :  సామాన్యముగా ప్రతియొక్క చాంద్రమాన మాసపు కాలావధిలోనూ ఒక సంక్రమణము ఉంటుంది . అయినా కూడా , సగటు మీద ప్రతి రెండున్నర సంవత్సరాల కొకసారి ఏదో ఒక చాంద్రమాన మాస కాలావధిలో సంక్రమణమే ఉండదు . ఆ చాంద్రమాన మాసమును ’ అధిక మాసము  అంటారు . దాని తరువాతి మాసానికి ’ నిజ మాసము ’ అంటారు . ఈ అధిక-నిజ మాసాలు రెంటికీ ఒకే పేరు . అంటే , ఉదాహరణకు  ఈసారి భాద్రపదము అధిక భాద్రపదము , నిజ భాద్రపదము అని రెండు సార్లు వస్తుంది . 

     ఇలాగ అధిక మాసము వచ్చినపుడు ఆ చాంద్రమాన సంవత్సరములో పదమూడు మాసాలుంటాయి . సరళము గా చెప్పాలంటే , చాంద్రమాన సంవత్సరము , సౌరమాన సంవత్సరము కన్నా పదకొండు రోజుల తక్కువ కాలావధిని కలిగియుంటుంది . దీనిని సరిచేయుటకే రెండున్నర సంవత్సరాలకు ఒకసారి అధిక మాసమును చేరుస్తారు . అలా చేర్చుటకు , ఎప్పుడంటే అప్పుడు కాక , సంక్రమణము లేని మాసము అన్న నియమము ఉంది . 

     క్షయ మాసము : ఒకోసారి , ఒకే చాంద్ర మాన మాసములో రెండు సంక్రమణములు వస్తాయి . ఆ చాంద్రమాన మాసమును క్షయ మాసము అంటారు. క్షయ మాసము కార్తీక , పుష్య మరియు మాఘ మాసములలో మాత్రమే సాధ్యము . క్షయ మాసము వచ్చినపుడు , ఆ మాసమూ , దాని తర్వాతి మాసమూ కూడా కలసి పోయినట్లు పరిగణించి ఆచరిస్తారు . దీనికోసము , తిథిలో నున్న రెండు కరణములలో మొదటిది క్షయ మాసానికీ , రెండోదానిని తర్వాతి మాసానికీ చేరినట్లు భావించి ఆచరిస్తారు . క్షయ మాసమున్న సంవత్సరములో పదకొండు మాసాలే ఉండాలి . కానీ , ఆ సంవత్సరములన్నిటిలోనూ తప్పకుండా ఒక అధిక మాసము వస్తుంది కాబట్టి , మొత్తం మీద పన్నెండు మాసాలుంటాయి . క్షయ మాసము 141 సంవత్సరాలకొకసారి సంభవిస్తుంది . అరుదుగా , 19  సంవత్సరాల కొకసారి వస్తుంది . 


     ఇక , ఇంకో సిద్ధాంతము ప్రకారము , సావన వ్యవస్థ అని ఉన్నది . దీనిని ’ బ్రహ్మ సిద్ధాంతము ’ అంటారు . దీని ప్రకారము , బ్రాహ్మణునికి అమావాశ్యతో ముగియునది మాసము . వైశ్యునికి పౌర్ణమితో ముగియునది , రాజులకు సంక్రమణముతో ముగియునది మాసము . 

అధిక మాసము , క్షయ మాసము ఏది వచ్చినా దానిని సామాన్యముగా ’ మల మాసము ’ అంటారు . 

     మలమాసములో నిత్య నైమిత్తిక కర్మలు ( సంధ్యావందనము , ఉపాకర్మ ,  ఔపాసన , బ్రహ్మ యజ్ఞము , తర్పణము ,శ్రాద్ధము వంటివి ) తప్పక చేయాలి . హోమాగ్ని నాశనమైనచో దానిని తిరిగి కూర్చుట , దేవతా ప్రతిమకు అర్చనా సంస్కారాలు లోపించిన తిరిగి ప్రతిష్ఠాపన చేయుట , నైమిత్తికములని చెప్పబడినవి . పాత గృహముల పునరుద్ధరణ ( రిపేరీలు ) చేయవచ్చును . 

సీమంతము , అన్న ప్రాశన వీటిని వదలరాదు . అంటే చేయవచ్చును . 

     తిథి వార నక్షత్రములతో చెప్పబడిన కామ్య కర్మలు , శుభ కార్యములు చేయరాదు . ఈ నిషేధము ఎలాగంటే , ఆ నెలలో మొదలుపెట్టి , అదే నెలలోనే పూర్తి చేయుట కూడదు . అధిక మాసములలో యజ్ఞములు ఆరంభించి ముగించుట కూడదు . ఎందుకంటే అక్కడ సంక్రమణములేక సూర్య మండలము తపిస్తున్నది యని .