Tuesday, 14 May 2013


నరసింహ, వామన, పరశురామ, వేదవ్యాస అవతారాలు

నరసింహ అవతారం

చతుర్దశమ్ నారసింహమ్ బిభ్రత్ దైత్యేంద్రమూర్జితమ్ |
దదార కరజైరూరౌ ఏరకామ్ కఠకృద్ యథా ||

తరువాత పద్నాల్గవ రూపం నరసింహ అవతారం. ఇది హిరణ్యకశపుడి బలిసిన దేహాన్ని చీల్చి ప్రహ్లాదుణ్ణి కాపాడటం కోసం "దదార కరజైరూరౌ ఏరకామ్ కఠకృద్ యథా", గడ్డిని కత్తితో కోసిపడేసినట్లుగా తన గోర్లతో హిరణ్యకశపుడి దేహాన్ని చీల్చిపారేసాడు.

వామన అవతారం

పఙ్చదశమ్ వామనకమ్ కృత్వాగాద్ అధ్వరమ్ బకేః |
పదత్రయమ్ యాచమానః ప్రత్యాదిత్సుః త్రిపిష్టపమ్ ||

స్వర్గాన్ని తిరిగి ఇవ్వాలని దాన్ని లాగేసుకున్న బలిచక్రవర్తి నుండి, ఆయన దగ్గర ధాతృత్వం అనే గుణం ఉందికదా అని దానికి తగినట్లుగా ఒక యాచక అవతారాన్ని ధరించి ఆ బలి చక్రవర్తి యాగం చేస్తున్నటువంటి చోటికి వెళ్ళి మూడడుగుల స్థలం కావాలని కోరి స్వర్గాన్ని తిరిగి దేవతలకి ఇచ్చాడు. అలా వచ్చిన వామన స్వరూపం పదహైదవ అవతారం.

పరశురామ అవతారం:

అవతారే షోడశమే పశ్యన్ బ్రహ్మ ద్రుహోనృపాన్ |
త్రిః సప్త కృత్వః కుపితః నిఃక్షత్రామ్ అకరోన్ మహీమ్ ||

పదహారవ అవతారం పరశురామ అవతారం. ఈ అవతారంలో లోకాన్ని నాశనం చేసే దుష్ట ప్రభువుల్ని తొలగించి భూమి భారాన్ని తగ్గించాలని "త్రిః సప్త", ఇరవై ఒక్కసార్లు భూని చుట్టాడట. ఎక్కడెక్కడ దుష్ట ప్రభువులుంటే వారిని సంహరించిపారవేసాడు. లోకంలో క్షత్రియులనే లేకుండా చేయాలని బయలుదేరిన అవతారం అది.

వేదవ్యాస అవతారం:

తతః సప్తదశే జాతః సత్యవత్యామ్ పరాశరాత్ |
చక్రే వేదతరోః శాఖా దృష్ట్వా పుంసోల్ప మేధసః ||

తరువాత పదిహేడవ అవతారం వేద వ్యాస అవతారం. ఈ లోకంలో ఉండే మనుష్యుల బుద్ధి పలచబడి పోతుంది అని ఒక్క మహా వృక్షంగా రాశీభూతమైన వేదాన్ని విభాగం చేసాడు. అట్లా 1131 శాఖలుగా విభజించాడు. అందుకు ఆయన పరాశర మహర్షి యొక్క కుమారుడిగా సత్యవతీ దేవికి అవతరించాడు.