శ్రీ కూర్మ జయంతి
Kaliyuga Daivam
శ్రీ కూర్మ జయంతి ..
మంధనాచల ధారణ హేతో, దేవాసుర పరిపాలవిభో
కూర్మాకార శరీర నమో, భక్తం తే పరిపాలయమామ్.
మహావిష్ణువు అవతారాలైన దశావతారాలలో శ్రీ కూర్మావతారం నేరుగా రాక్షస సంహారం కోసం అవతరించినది కాకపోయినా, విశిష్ట ప్రయోజనాన్ని బట్టి ఉద్దేశింపబడినది.
అసుర వేధింపులకు తాళలేక ఇంద్రాది దేవతలు బ్రహ్మతో కలసి పురుషోత్తముని ప్రార్ధించారు. కారణాంతరంగుడైన శ్రీ హరి అమృతోత్పాదన యత్నాన్ని సూచించాడు. పాలసముద్రంలో సర్వ తృణాలు, లతలు, ఓషధులు వేసి మందరపర్వతాన్ని కవ్వంగా చేసుకుని వాసుకి మహా సర్పాన్ని తరి తాడుగా చేసుకుని మధిస్తే సకల శుభాలు కలుగుతాయని, అమృతం లభిస్తుందని పలికాడు.
ఆ మేరకు ఇంద్రుడు దానవులనూ సాగరమధనానికి అంగీకరింపచేసాడు. పాముకి విషం తల భాగంలో ఉంటుంది. అది మృత్యు స్వరూపం. రాక్షసులు తామసులు, తమస్సు పాప భూయిష్టం. దాన్ని అణచివేస్తే తప్ప లోకంలోనైనా, మనస్సులోనైనా ప్రకాశం కలుగదు. అందుకే శ్రీహరి రాక్షసుల్ని మృత్యురూపమైన వాసుకు ముఖం వద్ద నిలిపాడు.
మధనంలో బరువుగా ఉండి కింద ఆధారం లేకపోవటంతో పర్వతం సముద్రంలో మునిగిపోయింది. అప్పటి శ్రీహరి లీల కూర్మావతారం. బ్రహ్మాండాన్ని తలపింపజేసే పరిమాణంతో సుందర కూర్మ రూపంలో శ్రీ మహావిష్ణువు అవతరించాడు. పాలసముద్రంలో మునిగిపోయిన సుందర పర్వతాన్ని తన కర్పకం (వీపు) పై నిలిపాడు. క్షీరసాగర మధనంలో చిట్ట చివర లభించిన అమృత కలశానికై దేవదానవులు కలహించగా, విష్ణువు మోహిని రూపం దాల్చి, రాక్షసులని సమ్మోహితుల్ని చేసి దేవతలకు అమృతం ప్రసాదించాడు. —