Friday 14 October 2011

ఆశ్వయుజ శుక్లపక్ష దశమి సంధ్యా కాలం విజయకాలమంటారు. అదేరోజు హిందువులందరూ విజయదశమిగా పండగ జరుపుకుంటారు.విజయదశమినాటి సాయంకాల సమయంలో శమీవృక్షాన్ని పూజిచడం అనాదిగా వస్తున్న పవిత్రమైన ఆచారం. శమీ అంటే జమ్మి అని అర్ధం. దేవతలు అమృతం కోసం పాలసముద్రాన్ని చిలికినప్పుడు పారిజాతం, బిళ్వం, తులసి, శమీ మొదలైన వృస్క్షాలు ఆవిర్భవించాయంటారు. ఈ చెట్లన్నింటికీ కలిపి 'వనమాలి' అనే ఓ అధిష్టాన దేవత కూడా ఉందంటారు. ఆ దేవతకే శమీదేవత అని పేరు. పాపాలను శమింపచేసే ఈ దేవతను తలుచుకున్నంతనే పాపాలుతొలగిపోతాయని పెద్దలు చెప్తారు.బిళ్వాష్టకాలలో జమ్మి ఒకటి. ఏక వింశతి పత్రాల్లో బిల్వ, బృహతి మొదలగు ఔషధ గుణాలున్న ఈ శమీపత్రాన్ని 'Prosopis spicigera' అనే పేరుతో పిలుస్తారు...వైదిక భాషలో శమీ వృక్షాన్ని 'అరణీ' అనే పేరుతో పిలుస్తారు. అగ్నిని ఉద్భవించేందుకు కాష్టాంతరంచే మధింప యోగ్యమైన దారువని "ఆరణి' అని అర్ధం. అందుకే పూర్వకాలం నుండి శమీవృక్షం పూజనీయమైంది.
శమీ పూజ ఎప్పటినుండి మొదలైందో తెలియదు కాని "అర్జునస్య ధనుర్ధారీ, రామస్య ప్రియదర్శనం" అనేదానిని బట్టి ఈ ఇద్దరు మహాపురుషులకు శమీవృక్ష పూజతో సంబంధముందని తెలుస్తుంది. అరణ్యవాసానికి వెళుతున్న రాముడికి శమీవృక్షం విశ్రాంతినిచ్చిందంటారు. త్రేతాయుగంలో ఆశ్వయుజ శుద్ధ దశమినాడు శ్రీరాముడు ఆదిపరాశక్తిని జమ్మి ఆకులతో పూజించిన తర్వాత రావణుడితో తొమ్మిది రోజులు యుద్ధం చేసి దశమినాడు విజయం సాధించాడని దేవీ భాగవతం చెబుతుంది. అదే విధంగా శమీ పూజ చేసేందుకు భారతకథ కూడా నిదర్శనమంటారు. పాండవులు పన్నెండేళ్ల అరణ్యవాసం ముగించుకుని అజ్ఞాతవాసానికి వెళ్లే ముందు తమ ఆయుధాలను జమ్మిచెట్టు మీద దాచిపెట్టి విరాటరాజు వద్ధ కొలువుకు వెళ్లారు. సంవత్సరం తర్వాత తిరిగి వచ్చి ఆ ఆయుధాలు ధరించి అర్జుణుడు గోగ్రహణంలో కౌరవులపై విజయం సాధించాడు. శమీ వృక్షం రూపంలో ఉన్న అపరాజితా దేవి తన్ను వేడినవారికి సదా విజయాన్నే అందిస్తుంది. అందుకే శమీ వృక్షానికి అంత ప్రాముఖ్యత. విజయదశమినాటి ఆయుధపూజ వెనుక అంతర్యము కూడా ఇదే..
శమీ శయతే పాపం
శమీశతృ వినాశనం
అర్జునస్యధనుంర్దారి
రామస్య ప్రియదర్శనం
దసరానాడు ఈ శ్లోకాన్ని ఒక కాగితం మీద రాసి శమీవృక్షానికి పూజచేసి కొమ్మకు కడతారు.విజయదశమినాడు శమీ పూజ అనంతరం జమ్మి ఆకులను బంగారం ఆకులని చెప్పుకుంటూ ఒకరికొకరు ఇచ్చుకుని శుభాకాంక్షలు చెప్పుకుంటారు. పెద్దవాళ్లకు ఆకులు ఇచ్చి పాదాభివందనం చేసి ఆశీర్వాదాలు తీసుకుంటారు. ఈ జమ్మి ఆకులను బంగారం అని అనడానికి గల వృత్తాంతం ఇది.... పూర్వం కౌత్సుడనే ముని కుమారుడు తన గురువుకు గురుదక్షిణగా ఇవ్వడానికి పదునాలుగు కోట్ల బంగారు నాణాలను అయోధ్యాపురంలోని రఘుమహారాజును ఆశ్రయిస్తాడు. అప్పటికే ధనాగారం ఖాళీ అవ్వడంతో ధనంకోసం రఘుమహారాజు కుబేరునిపై దండయాత్రకు పూనుకుంటాడు. అది తెలిసిన కుబేరుడు రాజభవనం ఎదుట ఉన్న శమీ వృక్షం పై కనకవర్షం కురిపింస్తాడు. కౌత్సుడు తనకు కావలసినంత బంగారాన్నే మాత్రమే తీసికెళ్లగా మిగతాది రాజ్యంలోని వారికి పంచేస్తాడు మహారాజు. ఆరోజే విజయదశమి కావడంతో జమ్మి ఆకులను బంగారంగా భావిస్తూ ఇతరులకు ఇవ్వడం ఆచారంగా వస్తుంది.
ఈ శమీవృక్షానికి ఆయుర్వేదంలో కూడా ఎంతో ప్రాధాన్యం ఉంది. ఈ చెట్టు ఆకులు, బెరడుల కషాయాన్ని నోటిలో పోసుకుని పుక్కిలిస్తే నోటి దుర్వాసన,పంటినొప్పి, చిగుళ్ల నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది. జమ్మి ఆకులు దంత సంబంధమైన వివిధ సమస్యలకు మంచి ఔషధంగా పని చేస్తాయి. కురుపులు , మొటిమలకు కూడా ఈ ఆకులు ఉపయోగపడతాయి. జమ్మీఅకులలో తేమతో పాటు ఐరన్, జింక్, మెగ్నీషియం మొదలైనవి మెండుగాఉన్నాయి. అంతే కాదు ఈ శమీవృక్షం వేళ్లు నత్రజనిని సమీకరించి భూసారాన్ని వృద్ధి చేస్తాయి. ఆరోగ్య సంబంధమైన ఉపయోగాలతో పాటు పవిత్రత్రత కలిగిన శమీపూజ విజయదశమినాడు భక్తి శ్రద్ధలతో జరుపుకోవడం శుభప్రదంగా భావించబడుతుంది.