Sunday, 22 December 2013

శాస్త్రమే ప్రమాణము తప్ప ఇతరములు కావు.

Thotapalli Sridhar Sarma

మన భారతీయ సంప్రదాయాలు
కలియుగంలో జనులు మంద బుద్ధులు, పరధర్మాసక్తతాపరులు, రోగపీడితులు, పాఖండులు (ఇది తిట్టుకాదు పా అంటే వేదం దాన్ని ఖండించేవారు పాఖండులు అని అర్థం) వగైరా వగైరా కలి ప్రభావ పూరితమైన మనస్తత్వం కలిగి ఉంటారని వ్యాసోక్తి. వ్యాస మహర్షి ఎంతో త్యాగ బుద్ధితో, జనులను ధర్మమార్గంలో ఉంచడానికి ఇచ్చిన వేదవిహితమైన వాఙ్మయం మనకి ప్రమాణం. గీతలో శ్రీ కృష్ణుడే చెప్తారు "తస్మాత్ శాస్త్రం ప్రమాణం తే కార్యాకార్యవ్యవస్థితౌ! జ్ఞాత్వా శాస్త్రవిధానోక్తం కర్మ కర్తు మిహార్హసి!!" తస్మాత్= కావున, కార్య+అకార్య వ్యవస్థితౌ = కార్యము చేయవలెనా చేయవద్దా అని నిర్ణయించవలసినప్పుడు, శాస్త్రం=శాస్త్రము తే ప్రమాణం=నీకు ప్రమాణం (అనుమాన నివృత్తి చేయదగలిగినది, ఆధారపడవలసినది) ఇహ శాస్త్రవిధానోక్తం=ఈ విధంగా చేయొచ్చా లేదా అన్న శాస్త్రవిధిని బట్టి కర్మకర్తుఁ=స్వకర్మను చేయడానికి అర్హసి = అర్హుడవౌదువు అని స్వయం విష్ణుమూర్తి సంపూర్ణ అవతారమైన శ్రీ కృష్ణపరమాత్మ బోధ. అంటే శాస్త్రమే ప్రమాణము తప్ప ఇతరములు కావు. శ్రీ కృష్ణుడికి దణ్ణం పెడతాం కానీ ఆయన చెప్పింది ప్రమాణం కాదంటే?

ఈ శాస్త్రములేవి అంటే అవి పధ్నాలుగు ఉన్నాయి అని చెప్పబడింది. ఈ పధ్నాలుగింటినీ ధర్మస్థానములు అంటారు
వేదములు - 4
1)ఋగ్వేదము 2) యజుర్వేదము 3)సామవేదము 4)అథర్వవేదము
వేదాంగములు 6
1)శిక్ష 2)కల్పము 3)జ్యోతిషము 4)వ్యాకరణము 5)నిరుక్తము 6)ఛందస్సు
ఇతరశాస్త్రములు
1)పురాణాములు 2) న్యాయము 3) మీమాంస 4) ధర్మ శాస్త్రములు
మొత్తం 14

సనాతన ధర్మంలో చరించే వారెవరైనా వీనిని తెలుసుకొని వాటికణుగుణంగా చరించవలసి ఉంటుంది. ఇవే ప్రమాణములు. తరవాతి పరంపరలో వచ్చినవారెవరైనా ఇవే తిరిగి తిరిగి తిప్పి తిప్పి చెప్పగలరు కానీ అవైదికాన్ని చెప్పరు కదా! అలా చెప్తే వైదిక ధర్మమెలా అవుతుంది!