Sunday, 22 December 2013

తెలియక చేసినా! తెలిసి చేసిన దోషం దోషమే!

Mandavilli Durga
తెలియక చేసినా! తెలిసి చేసిన దోషం దోషమే!

నృగుడు అనే మహారాజు సర్వం భూమండలాన్ని పరిపాలిస్తున్నాడు. ఇతను దానధర్మాలు అనేకం చేసిన పుణ్యాత్ముడు. అడిగిన వారికి లేదు అనకుండా దానం చేశాడు. ఈయన చేసిన దానాలు ఎవడూ లెక్కకట్టలేనన్ని ఉన్నాయి. ఈయన చేసిన దానలకి మెచ్చి కుబేరుడే ఈయనదగ్గర కొలువున్నాడు. లక్ష్మి ఎల్లప్పుడూ ఈయన దగ్గరే ఉండేది. వందలు, వేలు, లక్షలు గోవులను దానం చేశాడు. ఒకవేళ లేకపోతే కొనుక్కొచ్చి మరీ దానం చేసేవాడు. ఈ నృగ మహారాజు దానధర్మాల వలన సంపదలు వచ్చి పడిపోతూ ఉండేవి.
అలా ఎవరూ చేయలేనన్ని లెక్కలేనన్ని దానాలు చేశాడు. దేవతలు సైతం మెచ్చుకునేవారు. ఈయన పేరు ముల్లోకాలలో మారుమ్రోగి పోయింది. అంతటి మహా పురుషుడు. కాని ఒకసారి ఒక విప్రునికి గోవు దానమిచ్చాడు. అది 4, 5 రోజులకి మళ్లి వచ్చి రాజుగారి మందలో కలిసిపోయింది. ఈవిషయాన్ని గమనించని రాజుగారు! అదే గోవుని మరో విప్రుడికి దానమిచ్చాడు. ఆగోవును తీసుకెళుతుంటే, గోవుని పోగొట్టుకున్న విప్రుడు వెతుక్కుంటూ వెతుక్కుంటూ ఈయన్ని చూశాడు. ఈయనతోబాటు తీసుకెలుతున్న గోవుని చూసాడు. దీనితో మొదటి విప్రుడికి కోపం వచ్చి! నీకు బుద్దివుందా! సాటి విప్రుడి గోవుని దొంగతనం చేయడానికి మనస్సు ఎలా వచ్చింది. అనగానే గోవుని తీసుకెలుతున్న విప్రుడు ఆమాటలకి భాధపడి నేను దొంగతనం చేయడమేమిటి? రాజుగారు నాకు దానమిచ్చారు. తీసుకెళ్తున్నాను. కావాలంటే పద రాజుగారి దగ్గరే తెల్చుకుందాం అని రాజుగారి దగ్గరికి వెళ్లి విషయాన్ని వివరించారు. మొదటి విప్రుడు ఐతే ఏకంగా రాజుగారిని తిట్టేశాడు. నీకసలు కొద్దిగైన బుద్ది, జ్ఞానం ఉన్నాయా? నాకు దానమిచ్చిన గోవుని తీసుకొచ్చి ఇంకొకడికి దానమిస్తావా? చూడు నిన్ను ఇప్పుడే శపిస్తున్నాను అనేసరికి రాజుగారు ఒణికిపోయి! బ్రాహ్మణోత్తమా శాంతించండి. మీరు కోపగిస్తే ఎవరైనా బ్రతకగాలరా? దేవతలు సైతం గౌరవించే ఉత్తములు మీరు. శాంతించండి అని రెండోసారి దానమిచ్చిన విప్రుడిని! బ్రాహ్మణోత్తమా నీకు 1000గోవులు దానమిస్తాను. ఈగొవుని ఇచ్చేయి అన్నాడు. నేను ఇవ్వనంటే ఇవ్వను. ఎందుకంటే వీడు నన్ను అనవసరంగా నిందించాడు. లేకపోతె ఇచ్చేవాడినే అన్నాడు. మళ్లి మొదటి విప్రుడు దగ్గరికి వెళ్లి! నీకు రాజ్యం అంతా ఇచ్చేసి నేను అడవికి వెళ్ళిపోతాను. ఆగోవుని వదిలెయ్యండి అన్నాడు. ఆయనకూడా! కుదరదు. ఈగొవు కామధేనువు తో సమానం. అన్ని ఆవులు 5లీటర్లు పాలిస్తే ఇది 10లీటర్లు ఇస్తుంది కాబట్టి నేను వదులుకోను అని మొండి పట్టు పట్టారు ఇద్దరు బ్రాహ్మణులు. ఏమిచేయాలో తోచక ఇద్దరినీ బ్రతిమాలాడు. కాదంటే కాదు అని ఇద్దరు గోవుని వదిలేసి వెళ్లారు.

కొన్నాళ్ళు గడిచింది. కాలక్రమంలో రాజుగారు మరణించారు. ఈయన చేసిన దానాల పుణ్యం వలన స్వయంగా తీసుకెళ్ళడానికి యముడే వాహనం మీద వచ్చాడు. వాహనం మీద ఎక్కించుకుని తీసుకెళుతూ! మహానుభావా! నిన్ను దర్శించడం చాల సంతోషంగా ఉంది. నువ్వు చేసిన దానాలు, ధర్మాలు, ప్రజలని కన్నబిడ్డల్లా చూసుకున్న తీరు అద్భుతం. నీతో సరితుగేవాడు ముల్లోకాలలో లేడు. కాకపోతే విప్రులకి ఇచ్చిన దానం తిరిగి తీసుకోవడం అనే చిన్న దోషం వలన నీకు నరకం ప్రాప్తించింది. కనుక ముందుగా నరకానికి వెళతావ? స్వర్గానికి వెళతావా? ఇది కూడా నీవు చేసిన పుణ్యం ఫలితంగా అడుగుతున్న అవకాశమే గాని మరొక అవకాశం కాదు. సామాన్యంగా పాపులకి అవకాశం ఉండదు. కనుక ఆలోచించుకుని చెప్పమన్నాడు.

అప్పుడు నృగ మహారాజు! ముందు సుఖం అనుభవిస్తే కష్టం అనుభవించడం కష్టం కనుక ముందు నరకమే అనుభవిస్తాను అన్నాడు.
యమధర్మరాజు! సరే నరకానికి పో అని గెంటేశాడు. ఈనరక శిక్ష ఎప్పుడు తొలగుతుంది చెప్పండి అన్నాడు. ఇది కృతయుగ మధ్యమం. మధ్యలో త్రేతాయుగం వెళ్లి, ద్వాపర కలియుగ సంధి కాలం వస్తుంది. అప్పుడు విష్ణువు తానె స్వయంగా శ్రీకృష్ణ అవతారం దాల్చి, భావిలో తొండ రూపంలో కొండలా ఉన్న నిన్ను ఎడమ చేతితో తీసి భూమిపై పడేస్తాడు. అప్పుడు నీ శిక్ష తొలగి స్వర్గానికి వెళతావు అని పంపించాడు.
యమధర్మరాజు చెప్పినట్టే తొండగా మారి ద్వారకా నగరంలో ఒక భావిలో కప్పల్ని, పురుగుల్ని తింటూ ఉంటాడు. అలా దాదాపుగా 30 లక్షల సంవత్సరాలు నరకం అనుభవించిన తరువాత శ్రీకృష్ణుడి కుమారులు బంతి ఆట ఆడుకుంటుంటే ఆబంతి వెళ్లి ఈభావిలొ పడుతుంది. పిల్లలు బంతికోసం ఈబావిలొ చుస్తే తొండ కనబడుతుంది. ఇది బావిలో ఉంటె నీళ్ళు పాడౌతాయని దీన్ని బయటికి తీయడానికి తాడు కట్టి లాగుతారు. ఎంతలాగిన కొండలా కదలదు. వందలమంది వచ్చి లాగుతారు. అయిన కదలదు. కృష్ణుడు వీరిని చూసి తనే స్వయంగా వచ్చి ఎడమచేతితో బావిలో నుండి తీసి బయటపడేస్తాడు. ఆతొండ మానవరూపం ధరించి జరిగిన విషయాన్ని చెప్పి విమానం ఎక్కి స్వర్గనికీ వెళ్ళిపోతాడు.

కనుక మనం చేసే ప్రతి చిన్న తప్పు లెక్కలోకే వస్తుంది. రోజూ అన్నం, కూడా వండుకుంటున్నాం కదా అని ఆ మంటలో వేలు పెడితే తోలు ఊడుతుంది. కనుక మనకి నిర్దేశించిన పనులు చేయాల్సిందే. తెలిసికాని తెలియక గాని తప్పులు చేయకండి. శాస్త్రాలని, మీ ఇంటి ఆచారాల్ని తప్పని సరిగా అనుసరించండి.