Monday 30 December 2013

ధర్మాచరణ

Jaji Sarma
ధర్మాచరణ
మనుర్భవ జనయా దైవ్యం జనమ్ -( ఋగ్వేదం 10-5316)
స్త్రీ పురుషులు ఏ మార్గాన్ననుసరించినా అది వారితో పాటు, సమాజానికి సర్వ మానవ కళ్యాణానికి, సహకరించేదిగా ఉండాలని మన పూర్వులు అనుభవంతో చెప్పారు. తనవలె ఇతరుల కష్ట సుఖాలను - హాని లాభాలను తెలుసుకొన్నవాడే మనుష్యుడు.
"మనుష్యుడంటే దానం చేసేవాడు, శీలసంపన్నుడు, శుభగుణ విభూషితుడు, శ్రేష్టమైన ఆచారాలు కలవాడని" ఆర్య చాణక్యుడు వ్యాఖ్యానించాడు.
ధర్మాత్ములు, అనాధులు, నిర్బలులను రక్షించువాడు మనుష్యుడని అన్నాడు. సత్యము, న్యాయము, ధర్మముల కొరకు ప్రాణములను విడుచువాడే నిజమైన మనుష్యుడని అన్నాడు. దారుణమైన దు:ఖం ప్రాప్తించిన, ప్రాణ హాని కలిగిన, మానవత్వ రూప దర్మం నుంచి విచలితుడు కాకూడదని తన నిజజీవితంలో నిరూపించాడు. శుభకర్మలు చేయువాడు, ఆచారవంతుడు, ఆత్మజ్ఞానాన్ని పొంది సుఖించేవాడు మనుష్యుడని ఆర్య చాణక్యుడు కీర్తించాడు. ఆత్మజ్ఞానానికి మించిన సుఖం మరొకటి లేదని స్పష్టం చేశాడు.
హస్తస్య భూషణం దానం - చేతులకు దానమే భూషణం
సత్యం కంఠస్య భూషణం - కంఠమునకు సత్యమే భూషణం
శ్రోత్రస్య భూషణం శాస్త్రం - చెవికి ధర్మ వచనములే ఆభరణమని ఇవే సహజమైన, శాశ్వతమైన భూషణాలని ఘోషించాడు. భర్తృహరి మానవ ధర్మానికి సంబంధించిన ఈ సుగుణములు లేకుంటే మానవజన్మ వ్యర్ధమవుతుందని అన్నాడు.
ఓ కధ చెప్పుకుందాము.
ఒక అడవిలో మనుష్య శవం ఉంది. కొద్ది దూరంలో మహర్షి తపస్సు చేసుకుంటున్నాడు. ఆ శవాన్ని తినేందుకు నక్క ముందుగా శవం చేతులను సమీపించింది. ఆ మహర్షికి అంతరాయం కలిగి కన్నులు తెరిచి చూశాడు. వెంటనే దివ్యదృష్టితో చనిపోయిన ఆ వ్యక్తిని గురించి తెలుసుకున్నాడు. నక్కను ఉద్దేశించి " ఈతని చేతులు ఎన్నడూ దానం చేసి ఎరుగవు, కనుక వాటిని తినకూడదు" అన్నాడు. అప్పుడా నక్క చేతులను వదిలి చెవులను తినబోగా, "ఈ చెవులు ఏనాడు ధర్మశాస్త్రాలు గాని, ఆత్మజ్ఞానానికి సంబంధించిన అంశాలను గాని వినలేదు. కాబట్టి చెవులు ముట్టతగినవి కావు" అని అన్నాడు. అప్పుడా నక్క కళ్ళను తినబోయింది. "ఈ నేత్రాలెన్నడు సాధువులను దర్శించినవి కావు, కనుక తినరాదని" అన్నాడు. అప్పుడా నక్క కాళ్ళను తిందామనుకుంది. అది గ్రహించి, ఆ కాళ్ళు ఏనాడు మానవులను భవసాగరమునుంచి తరింప సజ్జలను, తీర్ధాలను దర్శించి ఎరుగవు కావున తినడానికి తగినవి కావని అన్నాడు. మృతుడి ఉదరం అన్యాయార్జితంతో పెరిగింది కాబట్టి అదీ తినకూడదేనని ముని చెప్పాడు. అప్పుడా నక్క కనీసం తలనైనా తిని పొట్ట నింపుకొందామనుకుంది. బతికి ఉండగా ఇతగాడి తల గర్వంతో మిడిసిపడుతుండేది, అదీ తినేందుకు తగింది కాదని మహర్షి వారించాడు!
ఈ కధ ద్వారా మనం గ్రహించవలసినది ఇది.
సత్యవాది, ధర్మాత్ముడు, సదాచారశీలి, సౌశీల్యమూర్తిగా మనిషి మెలిగితేనే మానవధర్మాన్ని సంపూర్ణంగా నిర్వర్తించినట్లు.