Saturday 13 July 2013

Jaji Sarma
శ్రీకృష్ణ పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవాలనే తపన నిరతిశయ ఆనందాన్ని కలిగించేది

ఏ గ్రంథాన్ని అనుసంధానం చేయాలన్నా గ్రంథాన్ని, గ్రంథ ఉపదేష్ట అయిన గురువుని ఆ గ్రంథం ప్రతిపాదించే అధిష్టాన దేవతనీ మూడింటినీ సమ మైన విశ్వాసంతో ఉపాసించగలిగితే అది మనల్ని సన్మార్గంలో నడిపిస్తుంది. గ్రంథమే కాదు ఏ మంత్రాన్ని ఉపాసన చేయాలన్నా ఈ మూడు విషయాలపై ఉపాసన చేయాలి. గురువు ఉపాసన అన్నప్పుడు కేవలం గురువే కాదు ఆ గురుపరంపరను మొత్తం స్మరించాల్సి ఉంటుంది.

ఈ మధ్య కాలంలో కొంత మంది గురువులు తామంతట తామే తెలిసేసుకున్నాం అంటూ స్వయంభువాచార్యులు ఉంటారు. అలాంటి వారిని వైదికులు ఎప్పటికీ అంగీకరించరు. ఎందుకంటే మనకు జ్ఞానం అనేది పూర్వ కాలం నుండి వస్తుంది, ఒక గురు పరంపర ఉంది. ఏ జ్ఞానం అయితే పెద్దలు స్వీకరించి ఉపాసించారో అదే మనకు అందాలి తప్ప ఈవేళ ఎవడో స్వతంత్రంగా తయారు చేసి ఇస్తాను అంటే అందులో వాడి యొక్క స్వంత పైత్యం ఉంటుందని అర్థం. అట్లాంటిది పెద్దల చేత అనాదరించబడుతుంది. అందుకనే వేదం కూడా నేను చెబుతున్నాను అని అనలేదు. "ఇతి శుశృమ పూర్వేశాం ఏనత్ తత్ వ్యాద చక్షిరే" మేం కూడా ఇలా విన్నాం అని అంటుంది వేదం. మేం ఇది చెబుతున్నాం అని అనలేదు. అట్లా అంటే అది కూడా ప్రమాణం అయ్యేదే కాదు. ఎప్పడిదీ విజ్ఞానం, అప్పటి నుండి అందుతోంది, తెలియదు మనకి. ఇది ఒక జ్ఞాన ధార. మన దాకా ప్రవహిస్తుంది.

మునయః సాధు ప్రృష్టోహమ్ భవద్భిర్ లోకమంగళం |
యత్ కృతః కృష్ణ సంప్రశ్నో యేనాత్మా సుప్రసీదతి ||

"మునయః సాధు ప్రృష్టోహమ్ భవద్భిర్" హే మునుల్లారా! నేను ధన్యుణ్ణి. మీలాంటి మాహానుభావులచేత ఒక మంచి విషయాన్ని చెప్పేలా అడగబడాను, నాకూ నాల్కని బాగుచేసుకోవడానికి అవకాశాన్ని కలిగిస్తున్నారు. మూరు ఆపాదించిన ఈ యోగ్యతకి చాలా సంతోషం. "లోకమంగళం యత్ కృతః కృష్ణ సంప్రశ్నః", లోకాలన్నింటికి మంగళాన్ని కలిగించే శ్రీకృష్ణ పరమాత్మ తత్వాన్ని అందించే ప్రశ్నను వేసారు. అఖిల దురితాలని తొలగిస్తుంది. సాక్షాత్ ధర్మమైన పరమాత్మని మనలో నింపుతుంది. తద్వారా మన జన్మకి ఒక సార్థకతని ఏర్పరుస్తుంది. అంతే కాదు "యేనాత్మా సుప్రసీదతి", దేనివల్ల అయితే ఈ జీవుడికి ఉండే దోషాలు తొలగుతాయో, వాడు శాంతిని పొందుతాడో, నిరతిశయ ఆనందాన్ని పొందుతాడో అలాంటి దాన్ని మీరు ప్రశ్న వేసారు.

మంచి విషయాలని తెలుసుకోవాలని కోరిక కలగటమే చాలా కష్టం. కలిగిన కోరిక తీరే విధానం లభించడం మరీ కష్టం. శౌనకాది ఋషులు తత్వాన్ని గురించి తెలుసుకోవాలన్న ప్రశ్నని సూతుల వారు మొదట విని వారిని పోత్సహించారు. మీరు వేసిన ప్రశ్న లోకానికంతటికీ క్షేమం కలిగించేటటువంటిది. ఆత్మని సంతృప్తి పరిచే ప్రశ్న వేసారు. సాక్షాత్తు భగవంతుని గురించి ప్రశ్న వేసారు అంటూ వారిని ప్రోత్సహించాడు. కఠోపనిషత్తులో నచికేతుడు ప్రశ్న వేస్తే యమధర్మ రాజు ఇంతటి ప్రశ్న వేసిన వాడు లోకంలో మరొకడు లేడు సుమా అంటూ పొగడుతాడు. అట్లా వారు వేసినది ఉత్తమమైన ప్రశ్న అని వారిని ఉత్తేజపరిచి మొదట వారు ధర్మం గురించి చెప్పడం ప్రారంభించారు.