Wednesday, 28 May 2014


Bramhasri Samavedam Shanmukha Sarma
2 hrs · 
శ్రీగణపతిని గురించి - రెండు పురాణాలు లక్ష్యభూతమై ఉన్నాయి. ౧. గణేశపురాణం ౨. మౌద్గల్య పురాణం
ముద్గల పురాణం: దక్షప్రజాపతి ముద్గల మహర్షుల సంభాషణాత్మకము. తొమ్మిది ఖండములు. 427 అధ్యాయములు. వీరభద్రునిచే పరాభూతుడైన దక్షునకు ముద్గలమహర్షి గణపతితత్త్వమునుద్బోధించి తత్సేవనమున విఘ్నశాంతిని ఫలముగా బొందినట్లీ పురాణమునందు చెప్పబడినది. వక్రతుండ గణపతి మత్సరాసురుని, ఏకదంత గణపతి మదాసురుని, మహోదర గణపతి మోహాసురుని, గజానన గణపతి లోభాసురుని, లంబోదర గణపతి క్రోధాసురుని, వికట గణపతి కామాసురుని, విఘ్నరాజ గణపతి మమతాసురుని, ధూమవర్ణ గణపతి అభిమానాసురుని, సంహరించి ఆత్మతత్త్వప్రకాశమును సంరక్షించినారు. అష్టవినాయక చరిత్రయు యోగష్టాంగములుగా వీరి ప్రసిద్ధియు తొమ్మిదవ ఖండమున వర్ణింపబడినది.
"న ముద్గల సమో భక్తో గణేశస్య ప్రదృశ్యతే!!" అని ప్రసిద్ధినందిన ముద్గలమహర్షి మౌద్గల్య గోత్ర ప్రవర్తకుడు. గాణాపత్య తత్వరహస్యముల నెరిగిన ప్రోఢ. సిద్ధపురుషుల ఆవిర్భావమునకు కాణాచి అయిన వంశములకు మూలపురుషుడు. ఏకాక్షర గణేశవిద్యను సాధిమ్చి బ్రహ్మతత్త్వమును సమాధి కౌశలమున గీటురాయి చేసుకొనిన వాడీ మహర్షి. తత్ప్రోక్తమైన పురాణమునూ పురాణములలో రాణకెక్కినది.