Bramhasri Samavedam Shanmukha Sarma
పురాణములు
అష్టాదశ పురాణాలను కృష్ణద్వైపాయనుడైన వ్యాసమహర్షి రచించాడని, రచించిన తాను వక్తగా కాకుండా ఆ విషయాలను ఒకప్పుడు నైమిశారణ్యంలో శౌనకుడు మొదలైన మహా మునులు దీర్ఘ సత్రయాగం చేస్తున్నప్పుడు, వారికి వ్యాసుని శిష్యుడైన రోమహర్షణమహర్షి కుమారుడైన సూత మహర్షి ద్వారా చెప్పించాడని పురాణాలే చెబుతున్నాయి. ఈ పురాణాలు మధ్య యుగం లో జరిగిన శైవ, వైష్ణవ ఘర్షణల వలన పరివర్తన చెందాయి అనే వాదన కూడా లేక పోలేదు. కొన్ని శ్లోకాల రచన శైలి వ్యాస మహర్షి రచన శైలిని గమనిస్తే ఆ విషయం అవగతం అవుతుంది.
"పురాణ" శబ్దానికి "పూర్వ కాల కథా విశేషం" అన్న అర్ధం నిరూఢమై ఉంది. క్రీస్తు పూర్వం ఐదవ శతాబ్దం నాటికే ఈ వాఙ్మయం ప్రస్తుతం లభిస్తున్న రూపు సంతరించుకొంది కాని వేదవాఙ్మయ కాలానికే దీని మౌలిక రూపం ఏర్పడి ఉండాలి. యజ్ఞసమయంలో ఋక్సామచ్ఛందాలతో పాటు ఉచ్చిష్ట రూపమై పురాణం ఆవిర్భవించిందని అధర్వణ వేదంలో తొలిసారిగా ప్రస్తావింపబడింది. శతపథ బ్రాహ్మణం, బృహదారణ్యకోపనిషత్తు, గోపథ బ్రాహ్మణం వంటి గ్రంధాలలో పురాణ ప్రశంసలున్నాయి. ఆదికాలంలో ఇది వేదాధ్యయనానికి ఒక సాంగ సాధన ప్రక్రియగా ఉండేదని, కాలక్రమంలో ప్రత్యేక శాఖగా పరిణమించి మతసాహిత్యంగా రూపుదిద్దుకొందని విమర్శకుల ఊహ. సుదీర్ఘ కాలం జరిగే యజ్ఞయాగాది కార్యాల సమయంలో నడుమ నడుమ విరాళ వేళలలో ఇష్ట కథా వినోదంగా ఇది మొదలై ఉండవచ్చును. ఆ యజ్ఞాలు చేసే రాజుల వంశాల చరిత్రను, యజ్ఞానికి లక్ష్యమైన దేతల కథలను ఇలా చెబుతూ ఉండవచ్చును. మొదటి కాలంలో బహుశా యఙ్నాన్ని నిర్వహించే పండితులే ఈ కథాకాలక్షేపం జరిపి ఉండవచ్చును కాని ఇది ప్రధాన కార్యక్రమం కాదు గనుక క్రమంగా సూత పౌరాణికులకు (క్షత్రియునకు బ్రాహ్మణ స్త్రీయందు జన్మించిన సంతానం) ఈ విధి సంక్రమించి ఉండవచ్చును. ఇలాంటి ఐతిహ్యం వాయు బ్రహ్మాండ విష్ణు పురాణాలలో కనిపిస్తుంది.
వ్యాస మహర్షి పురాణ సంహితను నిర్మించి తన సూత శిష్యుడు రోమహర్షునికి ఉపదేశించాడు. అతడు దానిని భాగాలుగా చేసి సుమతి, అగ్నివర్చుడు, మిత్రాయువు, శాంశపాయనుడు, అకృతవర్ణుడు, సావర్ణి అనే ఆరుగురు శిష్యులకు బోధించాడు. వీరిలో అకృతవర్ణుడు, సావర్ణి, కాశ్యప శాంశపాయనులు వేరువేరుగా మూడు పురాణ సంహితలను రూపొందించారు. రోమహర్షుని మాతృకతో కలిసి ఈ గ్రంధజాతమంతా పురాణ వాఙ్మయానికి మూలమయింది. ఈ విధంగా పరిశీలిస్తే అప్పటి యాఙ్ఞికులైన బ్రాహ్మణుల అధీనంలో ఉన్నవాఙ్మయాన్ని వ్యాసుడు విషయ క్రమం ప్రకారం పునర్వ్వస్థీకరించి, కాలానుగుణంగా అవుసరమైన మార్పులతో లోకులకు తెలియజేయమని బ్రాహ్మణేతరులైన సూతులకు అప్పగించాడు. ఆపస్తంభ ధర్మ సూత్రాలలోని ప్రస్తావనల ఆధారంగా క్రీ.పూ. 600-300నాటికే పురాణ వాఙ్మయం ఒక ప్రత్యేక శాఖగా రూపుదిద్దుకొందని, కాలానుగుణంగా ఉపదేశికుల బోధలను సంతరించుకొంటూ క్రీ.శ. 12వ శతాబ్దివరకూ మార్పులు చెందుతూ వచ్చిందని ఊహించవచ్చును.
పురాణాలు ప్రణవం నుండి పుట్టాయని సంస్కృత భాగవతంలోని పన్నెండవ స్కందం చెప్తుంది. బ్రహ్మదేవుడు ధ్యానమగ్నుడై ఉన్న సమయంలో ఆయన హృదయగృహ నుండి ఒక అనాహత శబ్ధం వెలువడింది. ఆ శబ్ధంలో నుండి అ కార ఉకార మకార శబ్ధాలు కూడిన ఓంకారశబ్ధం ఆవిర్భవించింది. "అ" నుండి "హ" వరకు గల అక్షరాలు ఆశబ్ధంనుండి ఉద్భవించాయి. ఓంకారం సకల మంత్రాలకు బీజాక్షరం అయింది. ఓంకారం నుండి నాలుగు వేదాలను ఉద్భవించాయి. ఆ 'అ'కార, 'ఉ'కార 'మ'కారములనుండి సత్వ,రజో,తమో అనే త్రిగుణాలు, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణవేదం అనే చతుర్వేదాలు, భూ॰భువ॰సువ॰ అనే త్రిలోకాలు, జాగృత్, స్వప్న, సుషుప్తి అవస్థలు జనించాయి. ఆ తరువాత బ్రహ్మదేవుడు చతుర్వేదాలను వెలువరించి తనకుమారులైన మరీచి తదితరులకిచ్చాడు. వారు తమ కుమారులైన కశ్యపుడు తదితరులకు ఇచ్చారు. అలా వేదాలు పరంపరాగతంగా సాగిపోతూ ఉన్నాయి.
వేదాలు ప్రజలకు క్లిష్టమైనవి కనుక అందుబాటులో లేనివి కనుక వేదవ్యాసుడు వేద ఉపనిషత్తు సారంతో కూడిన అష్టాదశ పురాణాలను రచించాడు. పురాణాలను వ్యాసుడు తన శిష్యుడైన రోమహర్షణుకి చెప్పాడు. రోమహర్షుడు తిరిగి వాటిని తన శిష్యులైన త్రైయారుణి, కశ్యపుడు, సావర్ణి లాంటి శిష్యులకు అందించాడు. ఆ తర్వాత అలా ఒకరి నుండి ఒకరికి సంక్రమించాయి.