Saturday 14 May 2011

అక్షయ తృతీయ

అక్షయ

తృతీయ అంటే ఏమిటి?
ఇంతకీ అక్షయ తృతీయ అంటే ఏమిటో, ఎలా వచ్చిందో తెలుసుకుందామా?!అక్షయం అంటే క్షయం లేనిది అని అర్థం. అంటే శాశ్వతంగా ఉండేది. అందుకే బంగారం, స్థలాలు, పొలాలు లాంటి విలువైన వాటిని అక్షయ తృతీయ నాడు కొనుగోలు చేయడం మొదలుపెట్టారు. ఈరోజు బంగారం కొంటే, మంచిదని, అదృష్టం కలసివస్తుందని నమ్ముతారు. ఈరోజు పరస్పరం కానుకలు ఇచ్చిపుచ్చుకుంటారు. అక్షయ తృతీయ పర్వదినం కోసం వ్యాపారులు ప్రత్యేక నగలు తయారుచేస్తారు. ముఖ్యంగా లక్ష్మీదేవి రూపాన్ని చిత్రించిన నాణాలు, రత్నాలు పొదిగిన నగలు ఈరోజు విశేషంగా కొంటారు.

పురాణాల్లో అక్షయ తృతీయ విశిష్టత
వేద వ్యాసుడు అక్షయ తృతీయనాడే మహాభారతం ఆరంభించాడు. వ్యాసుడు చెబుతుంటే, వినాయకుడు రాశాడు. విష్ణుమూర్తి ఆరవ అవతారమైన పరశురాముడు జన్మించింది కూడా అక్షయ తృతీయనాడే.
త్రేతాయుగం అక్షయ తృతీయ నాడే ప్రారంభం అయింది. అక్షయ తృతీయ నాడు చాలామంది విష్ణుమూర్తిని ప్రార్ధించి, ఉపవాసం ఉంటారు. దానధర్మాలు చేస్తారు. బియ్యం, ఉప్పు, నెయ్యి, పంచదార, కూరగాయలు, పసుపు, పండ్లు, బట్టలు, వస్తువులు - ఇలా ఎవరికి తోచినవి వారు దానం చేస్తారు
.
మహా ధనవంతుడు అయిన కుబేరుడు కూడా అక్షయ తృతీయ నాడు లక్ష్మీదేవిని పూజిస్తాడు.
అయోధ్య రాజు తీర్ధంకర రిషభదేవ సర్వ సంపదలూ త్యజించి, జైన సన్యాసిగా జీవించదలచాడు. జైన స్వాములు సర్వసంగపరిత్యాగులు. ఆఖరికి తమ ఆహారాన్ని కూడా తాము వండుకోరు. ఆకలేసినా, దాహమేసినా యాచనకు వెళ్తారు. ఒకరోజు రిషభదేవునికి ఆకలి వేసి యాచనకు వెళ్లాడు. అయితే తమ రాజు అడుగుతున్నది ఆహారం అని ఎవ్వరికీ అర్ధం కాలేదు. మహారాజు తమను అభ్యర్ధిస్తున్నాడు అంటే ధనమే అనుకున్నారు. ఇక అయోధ్య ప్రజలు రాజుగారికి బంగారం, నగలు, వజ్రవైఢూర్యాలు, ఏనుగులు, గుర్రాలు, ఖరీదైన దుస్తులు లాంటివెన్నో ఇచ్చారు. ఒక్క ఆహారం తప్ప అన్నీ ఇచ్చారు. పాపం, రిషభదేవుడు! ఇక ఆయన, కడుపు కాలిపోతోంది అని చెప్పలేక, ఆకలితో అలమటిస్తూ అలా ఉండిపోయాడు. ఒక సంవత్సరం అలాగే ఉండిపోయాడు. చివరికి ఆయన మనవడు శ్రేయాంశ కుమారుడు తాతగారి ఆకలిని గ్రహించి చెరుకురసం ఇచ్చాడు. సరిగ్గా ఆరోజు అక్షయ తృతీయ. అప్పటినుంచి జైనులకు అక్షయ తృతీయ పవిత్రదినం అయింది. ఉపవాసం ఉంటారు. పరస్పరం కానుకలు ఇచ్చుకుంటారు
.
హిందువులు, జైనులు విశేషంగా జరుపుకునే అక్షయ తృతీయను 'అఖ తీజ్' అని కూడా అంటారు. వైశాఖమాసం, శుక్లపక్షం మూడవ రోజు అక్షయ తృతీయ
.


అక్షయ తృతీయనాడు ఏం చేస్తారు
?
ధన దేవత లక్ష్మీదేవిని పూజిస్తారు. సంవత్సరం పొడుగునా ధనధాన్యాలు పుష్కలంగా రావాలని కోరుకుంటారు
.
మహాలక్ష్మి దేవాలయానికి వెళ్ళి,నాలుగు దిక్కులకు నాలుగు నాణాలను విసిరేస్తారు. ఇలా చేయడం వల్ల సంపదలు రావడానికి ద్వారాలు తెరుచుకుంటాయని నమ్ముతారు
.
బెంగాల్లో అక్షయ తృతీయ నాడు వ్యాపారులు గణపతికి, లక్ష్మీదేవికి పూజలు చేసి, కొత్త పద్దు పుస్తకాలు తెరుస్తారు
.
ఈరోజు గురువులకు దక్షిణ ఇస్తారు. పేదలకు దానధర్మాలు చేస్తారు
.
పూరీ రధయాత్రకు అవసరమైన రధాలను తయారుచేయడం కోసం ఒరిస్సా రైతులు అక్షయ తృతీయ నాడు మట్టిని తవ్వుతారు. చాలామంది అక్షయ తృతీయ నాడు ఉపవాసం ఉండి, వసుదేవుని ప్రార్థిస్తారు. పవిత్ర దినాన గంగానదిలో స్నానం చేస్తే పుణ్యం వస్తుంది. ఎదైనా వ్యాపారం ప్రారంభించడానికి అక్షయ తృతీయ చాలా మంచిది
.

అక్షయ తృతీయనాడు బంగారం కొనకపోతే ఏమవుతుంది
?ఇంతకీ అక్షయ తృతీయ రోజున ప్రత్యేకంగా బంగారం కొనడం అనే సంప్రదాయం ఎలా వచ్చింది - అనే సందేహం కలగడం సహజం.
అక్షయ తృతీయనాడు బంగారం కొనాలనే ఆచారం పూర్వం నుంచీ ఉన్నది కాదు, దక్షిణాదిన అసలే లేదు. సంప్రదాయం ఉత్తరాదినుండి మనకు వచ్చింది.. ఈమధ్యకాలంలో మరీ వ్యాప్తి చెందింది. ఇది ఖచ్చితంగా వ్యాపారుల చలవే. తమ లాభం కోసం విస్తృతంగా ప్రచారం చేశారు. ఇక సామాన్యులు అక్షయ తృతీయనాడు బంగారం కొంటే, కలసివస్తుంది అని నమ్మి దీన్ని ఒక ఆచారంగా పాటిస్తున్నారు. డబ్బు ఉంటే, బంగారం, స్థలాలు ఎప్పుడైనా కొనుక్కోవచ్చు. అవి ఆస్తులుగా మిగులుతాయి. అక్కరకు పనికొస్తాయి. కానీ, అక్షయ తృతీయనాడే కొనాలనే నియమం ఎక్కడా లేదు. పోటీ ప్రపంచంలో ఏదో నెపంతో వ్యాపారులు మనచేత వస్తువులు కొనిపించాలి అనుకోవడం సహజం. అంతమాత్రాన డబ్బు చేతిలో లేకుంటే అప్పు చేసి కొనాల్సిన అవసరం లేదు కదా!