Tuesday 2 April 2013


నరనారాయణులుగా నాలుగవ అవతారం

తుర్యే ధర్మ కలా సర్గె నర నారాయణావ్ ఋషీ |
భూత్వాత్మొపశమోపేతమ్ అకరోద్ దుశ్చరమ్ తపః ||

సృష్టి ఆరంభం అయిన తరువాత, బ్రహ్మగారి దేహంలోంచి నేరుగా ఉద్భవించినవారు ప్రజాపతులు అయ్యారు. ఆ ప్రజాపతుల ద్వారా ఉద్భవించినవారు మానవులు ఇతర ప్రాణులు అయ్యారు. ప్రజాపతులు అంటే భగవంతుడి వివిద భాగాల్లోంచి వెలువడ్డ వారు. అలాంటి ప్రజాపతుల్లో దక్ష ప్రజాపతి అనే ఒక ఆయన, ధర్మ ప్రజాపతి అనే మరొక ఆయన. పరమ శివుని భార్య అయిన పార్వతీదేవి తండ్రి హిమవంతుడు. పరమ శివునికి మొదట ఒక భార్య ఉండేది సతీదేవిఅని, ఆమె తండ్రిగారు దక్షుడు. ఆ దక్ష ప్రజాపతికి దాదాపు అరవై మంది సంతానం ఉన్నారు. అందులో కొంతమందిని పరమ శివుడు వివాహం చేసుకున్నాడు. అట్లా దక్షుడి ఒక సంతానమే మూర్తి అనే పేరుగల ఆమె. ఆమెను ధర్మ ప్రజాపతి వివాహం చేసుకున్నాడు. నాలుగవ అవతారంగా తానే ధర్మ ప్రజా పతికి మూర్తి అనే దక్ష ప్రజాపతి కుమార్తె ద్వారా నర నారాయణులనే కవల పిల్లలుగా అవతరించాడు. అయితే వారు పుట్టిన వెంటనే వారు తపస్సు చేసుకోవడానికి వారి తల్లి తండ్రుల వద్ద అంగీకారం పొంది తపస్సులో గూర్చున్నారు. వారు తపస్సుకి వెళ్తే తల్లి వారిరువురికి సేవ అందించడానికి వారి వద్దే ఉన్నది. ఇది బదరికాశ్రమం యొక్క సన్నివేశం. వారు తపస్సు చేస్తుంటే వారి చుట్టూ పర్వతాలు పేరుకుపోయాయి. ఇప్పుడు నర నారాయణులు ఇరువురు పర్వతాలుగా దర్శనమిస్తారు. నారాయణ పర్వతం కూర్చొని ఉన్నట్టు ఉంటుంది. నర పర్వతం నిలుచున్నట్టు ఉంటుంది. వారిరువురి మధ్య అలకనందా అనే నది ప్రవహిస్తూ ఉంటుంది. వారిరువురు అక్కడ ఉన్నారని ప్రతి ఋషి వెళ్ళి సేవించుకున్నారు. విజ్ఞానం కల్గిన మహనీయులంతా తపస్సులు అక్కడే చేసుకున్నారు.

వారిరువురు ఆ ప్రాంతాన్ని పవిత్రం చేసారు. అప్పుడు ఆరంభం చేసిన తపస్సు ఈనాటి దాకా చేస్తున్నారు. ఎందుకంటే మంత్రాన్ని తపస్సు చేసిన వ్యక్తి అందిస్తే తప్పక ఫలిస్తుంది. ఒకరికి అందించిన కొద్ది తపస్ శక్తి తరిగిపోతుంది, అట్లా లోకంలో తపస్ శక్తి ఎప్పటికి నిలిచి ఉండాలని, మంత్రం అందుకున్న వారికి శ్రమ లేకుండా వారు నిరంతరం అందిస్తూ ఉన్నారు. ఈ లోకంలో ఉండే జీవులంతా వారి ఆత్మ స్వరూపాన్ని గుర్తించి మానసిక ప్రశాంతతతో తరించడానికి అష్టాక్షరీ మంత్రాన్ని వెలువరించి ఆ మంత్రాన్ని ఆయన ఇప్పటికీ తీవ్ర తపస్సు చేస్తూనే ఉన్నాడు. ఆ మంత్రాన్ని ఉపాసనచేసే వాళ్ళందరికీ ఆ మంత్రం ఫలించాలి అంటే ఎంతెంతో కృషి చేయాల్సి ఉంటుంది, అది ఈ లోకంలో వాళ్ళు చేయగలరో చేయలేరో అని వాళ్ళ తరపున తానే చేస్తున్నాడు ఈ నాటికీ కూడా. "అకరోద్ దుశ్చరమ్ తపః" అలా అతి తీవ్రమైన తపస్సుని ఇప్పటికీ చేస్తునే ఉన్నాడు బదరికాశ్రమంలో.

లోకానికి సర్వ వేద సారమని ఋషులంతా ఉపాసించినట్టి, వేదమే దానికి సారం ఇదే అని చెప్పినటువంటి నారాయణ అష్టాక్షరీ మహా మంత్రాన్ని ఉపదేశం చేసిన స్వరూపం. ఒకే భగవంతుడు రెండు రూపాలు ధరించి ఈ మంత్రాన్ని ఉపదేశించాడు. ఆచార్యునిగా నారాయణుడు అయ్యాడు. శిష్యునిగా నరుడయ్యాడు. నారాయణుడు నరునికి ఉపదేశం చేస్తూ లోకం అంతా గుర్తించేట్టు చేసాడు. రెండు రూపాలు ధరించడం ఎందుకు అంటే, గురువు అవ్వడం సులభం కానీ శిష్యుడుగా ఉండటమే కష్టం. లోకంలో గురువు ఎట్లా ఉండాలి అని చూపించడానికి తానే గురు స్వరూపం ధరించి, శిష్యుడు ఉండాల్సిన క్రమం ఏమి అనేది తెలుపడానికి తానే శిష్య రూపం ధరించి భగవంతుడు నారాయణ అష్టాక్షరి మంత్రాన్ని దర్శించి ఇచ్చాడు. మంత్రాన్ని తాను తయారు చేయలేదు, వేదాల్లో ఉన్న మంత్రమే. పైకి కనిపించక దాగి ఉన్న మంత్రాన్నే పైకి తెచ్చి లోకం అంతా గుర్తిచ్చేట్టు అందించాడు.