Friday 9 November 2012

విదురనీతి




Jaji Sarma

  • విదురనీతి
    దృతరాష్ట్రుడు " నిద్ర పట్టటం లేదు ఎమైనా మంచి వాక్యాలు చెప్పు" అడిగిన దానికి విదురుడు ఇచ్చిన బదులు విదురనీతిగా ప్రసిద్ధి పొందింది. విదురుడు " రాజా! మనిషి తనను లోకులు నిందించే పని చేయక లోక హితమైన కార్యాలు చేయాలి. పరుల సంప్దకు ఈర్ష్యపడక నలుగురితో కలిసి మెలిసి బ్రతకాలి. కోపం, పొగడ్తలకు పొంగి పోవడం , గర్వించడం, ఎంత ఉన్న అసంతృప్తి, దురభిమానం, ఏపనీ చేయక పోవడం దుర్జనుల లక్షణం. తనను పాలించే రాజును , లోకాన్నిరక్షించే భగవంతుని, కట్టుకున్న భార్యను, బంధువులను సముచితంగా ఆదరించక పోతే ఏ కార్యం సత్ఫలితాన్ని ఇవ్వదు. అవివేకులు తమను ప్రేమించే వారిని వదిలి ద్వేషించే వారి వెంట పడతారు. ఎదుటి వాడు బలవంతుడని తెలిసినా వారిని హింసిస్తాడు. ధనము, విద్య,వంశము మంచి వారికి గౌరవాన్ని అణుకుకువను కలిగిస్తే చెడ్డవారికి మదాన్ని గర్వాన్ని కలిగిస్తుంది. ఒకని బాణం శత్రువును నిర్జించ వచ్చూ లేక తప్పి పోవచ్చు కాని ఒకని నీతి శత్రువును నాశనం చేస్తుంది. తాను ఒక్కడే తినడమూ అందరూ నిద్రిస్తున్నప్పుడు ఒక్కడే ఆలోచించడం , ఒంటరిగా ప్రయాణం చేయడమూ మంచిది కాదు. లోకంలో సత్యానికి మించిన మంచి గుణం లేదు. క్షమాగుణాన్ని చేతగాని గుణంగా భావిస్తారు కాని దానికి మించిన ధర్మం లేదు. పరుషవాక్యములు మాట్లాడక పోవడం, పాపపు పనులు చేయక పోవడం వలన మనిషి ఉత్తముడు అవుతాడు. బలవంతుడై శాంతంగా ఉండే వాడు, పేద వాడైనా దానం చేసే వాడు పుణ్యపురుషుడు అనిపించు కుంటాడు. న్యాయార్జితమైన ధనాన్ని అర్హులకు ఇవ్వక పోవడమూ అనర్హులకు ఇవ్వడమూ వలన కీడు కలుగుతుంది. పరస్త్రీ వ్యామోహం, మద్యపానం, వేటాడటం, పరుషభాషణ, వృధాగా ధనమును ఖర్చు చేయడమూ, పోట్లాడటమూ సప్త వ్యసనాలని విజ్ఞులు చెప్తారు. కనుక వారు వాటి జోలికి పోరు. తనకు ఉచితమైన దుస్తులు ధరించడమూ, ఆత్మ స్తుతి చేయక పోవడమూ, దానిమిచ్చి పిదప చింతించక ఉండుట, కష్ట కాలంలో కూడా ధర్మ మార్గాన్ని విడనాడక ఉండుట మంచి నడవడి అనిపించుకుంటుంది. స్నేహం, మాటలు, పోట్లాట తనకు సమానులతో చేయాలి కాని అల్పులతోను అధికులతోను కాదు. తనకు ఉన్నంతలో ఇతరులకు ఇవ్వాలి, శత్రువనా కోరిన సహాయం చేయాలి. ఎక్కువగా కష్టపడి తక్కువగా సుఖపడాలి. మంచి వారు పొగడ్తలకు మేలు చేస్తారు కాని కీడు చేయరు. నేను చెప్పిన లక్షణాలు ధర్మజునిలో ఉన్నాయి. నీవు వారిని ఆదరించి ఇప్పుడు నిరాదరణకు గురి చేసావు. వారి రాజ్యభాగాన్ని వారికి ఇచ్చి వారిని ఆదరించడం నీ ధర్మం. మీరు కలసి ఉన్నంత కాలం దేవతలు కూడా మీ వంక కన్నెత్తి చూడలేరు " అన్నాడు.
    విదురుని మాటలు విన్న దృతరాష్ట్రుడు " విదురా? నన్ను ఇప్పుడు ఏమి చేయమంటావు " అని అడిగాడు. విదురుడు " అలా అడిగితే నేను ఏమి చెప్పను? రాజ్యం దక్కింది కదా అని తమ్ముని రాజ్యం కాజేయాలని చూసావు. చేపతో సహా గాలం కూడా మింగిన చందాన ఉంది నువ్వు చేస్తున్న పని. పక్వానికి రాక మునుపే పండును కోసిన రుచిగా ఉండక పోవడమే కాక దాని విత్తనం తన ప్రయోజనాన్ని కోల్పోతుంది. పరుల ధనానికి, విద్యకు, పరాక్రమానికి ఈర్ష్య చెందే వాడు ఏరోగం లేక పోయినా బాధ పడక తప్పదు. ఎదుటి వానికి ప్రియం కలిగించేలా మాట్లాడలేక పోయిన ఊరక ఉండటం మంచిది. మాటల వలననే పగ, చెలిమి, తెలివి, కలత, ధర్మము, పాపము, కీత్రి, అపకీర్తి కలుగుతాయి. గొడ్డలితో నరికిన చెట్టు కూడా చిగురిస్తుంది కాని మాటలతో చెడిన కార్యం సిద్ధించదు. మనసుకు తగిలిన గాయం మాన్పవచ్చు కాని శరీరానికి తగిలిన గాయం మాన్పలేము. ధర్మరాజు నోటి వెంట ఒక చెడు మాట కూడా రాదు కాని నీ కుమారులు నీచపు మాటలు నీకు తెలియనివా? చేటు కాలం దాపురించిన చెడ్డ మాటలు కూడా తీయగా ఉంటాయి. దుష్టులు చేసే దుర్మార్గం కూడా బాగానే ఉంటుంది. కాని మనసుకు అవి తగని పనులని తెలుసు. ధర్మ నిరతుడైన ధర్మరాజు తన సంపదకు దూరం కావడం ధర్మమా? అతడు నీ పెద్దరికాన్ని గౌరవిస్తున్నాడు కాని నీవు పాండవుల విరోధం కోరుతున్నావు.ఎన్ని పుణ్య కార్యాలు చేసినా అవి ధర్మవర్తనకు సరి రావు. ఉత్తముడు లంభించిన కీర్తి ఇహ లోకంలో ఉన్నంత కాలం అతడు పరలోకంలో పుణ్యగతులు పొందగలడు. పూర్వం ప్రహ్లాదుడు రాక్షస కులంలో జన్మించినా ధర్మ మార్గం తప్పక అంగీరసునికి తన కుమారునికి వచ్చిన వివాదంలో పక్షపాత రహితంగా అంగీరసుని పక్షాన న్యాయం చెప్పాడు. కనుక నీవు కూడా నీ కుమారుల పట్ల పక్షవాతం వదిలి ఇరువుకి సంధి చెయ్యి. అందు వలన అందరూ సుఖపడతారు. పెద్దలు లేని సభ సభ కాదు, న్యాయం మాటాడలేని వారు పెద్దలు కారు, సత్యం లేని ధర్మం ధర్మం కాదు, ఏదో ఒక మిష మీద చెప్పేది సత్యము కాదు. నీతి మార్గంలో నడవడం ఉత్తమం, శౌర్యంతో సంపదలు పొందుట మద్యమము, భారంగా బ్రతుకు లాగుట అధమం. నీతి దూరులను ఉత్తములు మెచ్చరు. నీ పుత్రులు ఎప్పుడూ నీతి మాలిన కార్యాలను మాత్రమే చేస్తారు. యుద్ధోన్మాదంలో ఉరకలు వేస్తుంటారు. దానికి కర్ణుడు అగ్నికి ఆజ్యం పోస్తున్నట్లు ప్రోస్త హిస్తుంటాడు. నీకేమో నీతి పట్టదు. పాండవులు కయ్యానికి కాలు దువ్వరు; కయ్యానికి పిలిచిన వారిని వదలరు. పాడవులు నిన్ను తండ్రి మాదిరి గౌరవిస్తున్నారు నీవు అలాగే వారిని కన్న కొడుకులుగా చూడటం మంచిది. మేలు చేసిన వాడికి కీడు చేసిన వాడి శవాన్ని కుక్కలు కూడా ముట్టవు. నీ తమ్ముడు పాండు రాజు నీకు పరమ భక్తుడు, పాండవులు నీకెంతో మేలు చేసారు. వారిని ఆదరించడం మంచిది. ప్రతి మనిషికి సుఖ దుఃఖాలు సహజం. దుఃఖించడం వలన శక్తి నశిస్తుంది, మతి చెడుతుంది, శరీరం కృశిస్తుంది, రోగం వస్తుంది శత్రువుకు అది బలాన్ని చేకూరుస్తుంది కనుక దు॰ఖించడంమాను " అన్నాడు. దృతరాష్ట్రుడు " విదురా! నేను ధర్మతనయుని నా మాటలతో చేతలతో బాధించాను. అందు వలన నా కుమారులకు మరణం తధ్యం. నేను దుఃఖించక ఎలా ఉండగలను " అన్నాడు. విదురుడు " రాజా! నీవు లోభం విడిచి మనసు అదుపులో పెట్టుకుంటే మనశ్శాంతి అదే లభిస్తుంది . జ్ఞాతి వైరం వదిలి పెట్టు. గోవులను, బ్రాహ్మణులను అగౌరవ పరచ వద్దు. అన్నదమ్ములు కలిసి ఉండేలా చూడు. ఒక్క చెట్టును కూల్చడం తేలిక అదే అనేక చెట్లు ఒకటిగా ఉండగా పెను గాలి కూడా వాటిని కూల్చ లేదు.పాండు పుత్రులను పిలిచి వారికి హితం కలిగించి నీ పుత్రులను బ్రతికించుకో. జూదం ఆడిన నాడే నేను వద్దని చెప్పాను నీవు విన లేదు. కాకుల వంటి నీ కుమారులను నమ్మి నెమళ్ళ వంటి పాండవులను వదులుకుని ఇప్పుడు తల్లడిల్లి పోతున్నావు. కుల నాశకుడైన కుమారుని వదిలితే వచ్చే నష్టం ఏమిటి. భీష్ముడు, కర్ణుడు, ద్రోణుడు, పాండుపుత్రులు సుయోధనాది పుత్రులు మనుమలైన లక్ష్మణ కుమారుడు, అభిమన్యుడు నిన్ను సేవిస్తుంటే నీ వైభవం ఎలా ఉంటుంది. శత్రు రహితమైన ఆ వైభవంతో సాటి ఏమి ? " అన్నాడు. దృతరాష్ట్రుడు " విదురా! నీవు చెప్పిన మాటలు బాగున్నా నా కుమారులను వదల లేను కనుక ధర్మం జయిస్తుంది " అన్నాడు. విదురుడు " రాజా! నీవు నీ కుమారులను వదల వద్దు పండవులను దూరం చేసుకోవద్దని మాత్రమే నేను చెప్తున్నాను. నీ కుమారులను ఒప్పించి పాండవులకు ఐదు ఊళ్ళైనా ఇప్పించు.ఉద్ధం నివారించడానికి కొడుకులను వదల మన్నాను కాని సంధి చేసుకుంటే అందరికీ క్షేమమే కదా! ఎన్ని భోగాలు అనుభవించినా మహారాజులకైనా చావు తప్పదు. కనుక నీకొడుకులను సంంధికి ఒప్పించు ధర్మరాజును శాంత పరచు " అన్నాడు. దృతరాష్ట్రుడు " విదురా! నీ మాటలు బాగున్నాయి. అలాగే చేస్తాను " అన్నాడు.విద్రుడు " ఆ మాట మీద ఉండు దుర్యోధనుని చూసి మనసు మార్చుకోకుండా ధర్మరాజుతో సంధి చేసుకో " అని చెప్పి తన మందిరానికి వెళ్ళాడు.