Monday, 12 November 2012




ఆశ్వయుజ అమావాస్య - దీపావళి స్నానవిధి.

కాలము అత్యంత బలవత్తరమైనది. సనాతన ధర్మంలో కాలమే సమస్తమైనదిగా నిలబడుతుంది. అందుకే భగవద్గీతలో గీతాచార్యుడు 'కాలః కలయతామహం' అంటాడు. నేను కాలస్వరూపంలో ఉండి లెక్కలు కట్టుకుంటూ ఉంటాను అంటాడు. వ్యాసభగవానుడు దేవీ భాగవతం చేస్తూ అంటాడు

'కాలోహి బలవాన్ కర్తా సతతం సుఖ దుహ్ఖయో:!
నరాణాం పరతంత్రానాం పుణ్య పాపానుయోగతః!!
అని. ఇవ్వాళ జీవుడు ఈ శరీరంలో ఉన్నాడు గతంలో ఏ శరీరంలో ఉన్నాడో? చేసిన పాప పుణ్యములు అనుభవము చేతనే పోవాలి. పాపము అనుభవస్వరూపముగా పోవడానికి దుఃఖము, అలాగే పుణ్యము అనుభవస్వరూపముగా పోవడానికి సుఖము, రెండిటినీ ఇవ్వాలి. అందుకే ధూర్జటి:

నిను సేవింపగ నాపదల్పొడమనీ, నిత్యోత్సవంబబ్బనీ జనమాత్రుండననీ మహాత్ముడననీ సంసారమోహంబు పై కొననీ జ్ఞానముగల్గనీ గ్రహగతుల్ కుందింపనీ,మేలు వ చ్చిన రానీ యవి నాకు భూషణములే శ్రీ కాళహస్తీశ్వరా!
అలా ఉండగలిగినటువంటి పరిణతి ఈశ్వరునియొక్క కృపవలనే సంభవం అవుతుంది. అటువంటి కాలము పరమ బలవత్తరమైనటువంటి స్వరూపము. అది ఈశ్వర స్వరూపంగా ఉండిసుఖ దుఃఖముల రూపములో పాపములను అనుభవింప చేసి దానివలన కంటికి కనపడనటువంటి ఈశ్వరుని యొక్క ప్రజ్ఞని గుర్తెరిగి ఆయన పాదములయందు నిరతిశయమైనటువంటి భక్తీ పెంపొందింపచేసుకోగలిగి కృతార్ధుడు కాగలిగినటువంటి వ్యక్తీ ధన్యాత్ముడు. అందుచేతనే ఋషులు కాలాన్ని విభాగం చేశారు. అది ఋషుల యొక్క దార్శనికత. అందుకే పుట్టుకతోనే ఋషులకు రుణపడిపోయాము మనం. ఋషిఋణం తీరాలి అంటే ఋషిప్రోక్తమైనటువంటి వాజ్ఞ్మయాన్ని చదువుకోవాలి. చదవడం రాని వారు రోజూ ఒక పుష్పం వాటిమీద ఉంచాలి. అవి చేయని నాడు ఋషిఋణం తీరదు. అటువంటి ఋషి కాలాన్ని విభాగం చేసి ఏ సమయమునందు మనం పరమేశ్వరానుగ్రహం పొందడానికి కాలము మనకి యోగ్యమైన రీతిలో ఉంటుందో నిర్ణయం చేశారు. అందుకే ఒక సంవత్సరాన్ని ప్రమాణంగా తీసుకున్నప్పుడు దక్షిణాయనము, ఉత్తరాయనము అను రెండు పేర్లతో నడుస్తుంది. వీటిలో దక్షిణాయనము తక్కువని, ఉత్తరాయనము ఎక్కువని భావన చేయకూడదు. శంకరాచార్యుల వారు బ్రహ్మసూత్ర భాష్యం చేస్తూ 'కొన్ని కొన్ని లోకముల మీదుగా జీవుడు ప్రయాణం చేస్తూ బ్రహ్మలోకంలో కొంతకాలం వాసం చేసి మహాప్రళయమందు ఈశ్వరునియందు ఐక్యం అయ్యేటువంటి స్థితి దక్షిణాయనం' అన్నారు. యదార్ధమునకు ఉత్తరాయణంకన్నా దక్షిణాయనం చాలా గొప్పది. ఎందుచేతననగాదక్షిణాయనం ఉపాసనా కాలము. పరమేశ్వరుని ఆరాధన చేయడానికి యోగ్యమైన కాలము.
ఒక మహత్తరమైన విషయాన్ని చెప్పేటప్పుడు ముందే దాని గురించి ప్రారంభం చేస్తారు. అందుకే శ్రీరామాయణంలో వాల్మీకి మహర్షి సుందరకాండ ప్రారంభానికి ముందు కిష్కిందకాండ చిట్ట చివర ఒక శ్లోకాన్ని రచన చేశారు.'సవేగవాన్ వేగసమాహితాత్మాహరిప్రవీరః పరవీరహన్తా.మనస్సమాధాయ మహానుభావోజగామ లఙ్కాం మనసా మనస్వీ'కార్తీకమాస వైభవం ఆశ్వయుజ మాసపు చిట్టచివరి తిధిలో ఉంది. ఆశ్వయుజ అమావాస్యనే ప్రేత అమావాస్య అంటారు. ప్రతి అమావాస్యకి ప్రదోష కాలానికి పితృ దేవతలు వస్తారు. అందుకే అమావాస్య సాయంకాలం అన్ని పూజలకన్నా ముందు పూజ దివిటీ కొట్టడం. ఇది మగపిల్లలు చేయాలి. ఆడపిల్లలు చేయరాదు. వారు గోగు కర్ర మీద జ్యోతి వేసి ఒత్తి వెలిగించి దక్షిణ దిక్కుగా వాటిని ఎత్తి చూపించాలి. 'నాన్నగారూ నేను వేద ధర్మాన్ని తెలుసుకున్నాను. వేద ప్రమాణమునందు గౌరవం ఉంచాను. ఇవాల్టి తిధిని నేను జరుపుకొని అలక్ష్మిని పోగొట్టుకుంటాను. నేను భగవదనుగ్రహాన్ని అంతరంగమందు పొందుతాను. జీవుడు ఉన్నతిని కొరకు. బాహ్యమునందు లక్ష్మీ దేవి అనుగ్రహాన్ని పొందుతాను. నేను పెద్దల వలన తెలుసుకున్నాను ఆశ్వయుజ మాస వైభవాన్ని. కాబట్టి నేను పాటిస్తాను. మీరు బయలుదేరండి చీకటి పడుతోంది కాబట్టి వెలుతురు చూపిస్తాను' అని జలతర్పణ చేయకుండా దివిటీ చూపించే తిథి ఆశ్వయుజ అమావాస్య. శరీరాన్ని మనకి ఇచ్చి తమ శరీరాన్ని విడిచి పెట్టిన పితృ దేవతలు జ్యోతిస్వరూపులై అంతరిక్షమునందు ప్రయాణం చేస్తారు. వారిని గౌరవించవలసిన అవసరం ఒక కొడుకుగా నీకు ఉంది. ఆశ్వయుజ కార్తీకములు అత్యంత ప్రమాదకరమైన నెలలు. ఉపాసనకు ఎంత గొప్పతిధులో బాహ్యమునందు అంత ప్రమాదకరమైన నెలలు. శరదృతువులో ఆశ్వయుజ మాస ప్రారంభంలో యమధర్మరాజుయొక్క దంష్ట్ర బయటికి వస్తుంది. కార్తీక మాసం చివరిలో లోపలి తీసుకుంటాడు. మళ్ళీ చైత్ర మాస ప్రారంభంలో దంష్ట్ర బయటికి వస్తుంది. వైశాఖ మాసం చివరిలో లోపలి తీసుకుంటాడు. ఆశ్వయుజ కార్తీకములలో అత్యంత ప్రధానమైనది దీపము. దీపావళి అనగా దీపముల వరుస.

దీపావళి అమావాస్యనాడు గంగ ఎక్కడున్నా మనం స్నానం చేస్తున్న నీటిలోనికి ఆవాహన అవుతుంది.

'తైలే లక్ష్మీర్జలే గంగా దీపావళి తిథౌవసేత్!
అలక్ష్మీ పరిహారార్ధం తైలాభ్యంగో విధీయతే!!

దీపావళి నాడు గంగ నీటిని, లక్ష్మి నూనెను ఆవహిస్తుంది. అందుకే నూనె రాసుకొని స్నానం చేయాలి. ఎందుకంటే లక్ష్మీ స్పర్శవల్ల అలక్ష్మీ పోతుంది. గంగ స్నానం చేత పాపరాశి ధ్వంసం అవుతుంది. ఆరోజు తప్పకుండా దీపముల వరుస వెలిగించి వాటి కాంతిలో అలక్ష్మిని తొలగగొడతారు. అంతరమందు జీవుని యొక్క ఉన్నతినీ, బాహ్యమునందు అలక్ష్మిని పోగొట్టుకొంటున్నాము అని చెప్పడానికి పెద్ద చప్పుళ్ళు చేస్తూ వెలుతురుతో కూడిన వివిధరకములైన బాణా సంచా కాలుస్తాము. బాణసంచా కాల్చడానికి కారణం నరకాసురవధ అని కాదు...'అలక్ష్మీ పరిహారార్ధం'. పితృదేవతలకు మార్గం చూపించడానికి ఇంట్లోకి వెళ్లి కాళ్ళూ చేతులూ కళ్ళూ కడుక్కొని ఆచమనం చేసి లక్ష్మీ పూజ చేస్తారు. తరువాత దీపముల వరుసలు పెడతారు. ఆకాలమందు అమ్మవారు ఉత్తరేణి చెట్టు వ్రేళ్ళయందు ప్రవేశిస్తుంది. ఈరోజు మట్టితో కూడుకున్న ఉత్తరేణి తీసుకొని స్నానం చేసేటప్పుడు సంకల్పం చెప్పి తలమీదనుంచి నీళ్ళు పోసుకుంటూ ఆ ఉత్తరేణి చెట్టు యొక్క మట్టి మీద పడేట్లుగా తిప్పుకోవాలి.

ఆ సమయంలో ఒక శ్లోకాన్ని మంత్రరూపంలో చెప్తారు. మంత్ర రూపంలో చెప్తే కొంతమందికే అధికారం వస్తుంది. శ్లోక రూపంలో చెప్తే అందరూ దానిని అనుసంధానం చేసుకోవచ్చు. అందుకని ఒక శ్లోక రూపంలో మహర్షులు మనకు అందించారు.

'శీతలోష్ణ సమాయుక్తా సకంటక దళాన్వితా!
హరపాప మపామార్గా బ్రాహ్మ్యమాణ పునః పునః!!

అపామార్గా=ఉత్తరేణి చెట్టూ; శీతలోష్ణ సమాయుక్తా=మట్టి పెళ్ళలతో కూడుకున్న దానివి ఉన్నావు; నిన్ను నేను నా చుట్టూ తిప్పుకుంటున్నాను. ఎందుకంటే పరదేవతానుగ్రహము నీయందు ప్రవేశించి యమదంష్ట్ర తగలకుండా దూరంగా తొలగదోయగలవు. అందుకని నా వంటికి రక్ష పెట్టుకుంటున్నాను అమ్మవారి రూపంలో..ఏ చిన్న పాపమో అడ్డుపెట్టి నన్ను ప్రమాదంలో పడతోయకుండా పాపమును తీసి అపమృత్యువునుంచి గట్టెంకించదానికి నిన్ను నేను తిప్పుకుంటున్నాను. అందువల్ల నా పాపములను శమింపచేయి. నాకు అపమృత్యువు రాకుండా కాపాడు అని అనుకుంటూ తిప్పి పక్కన పడేస్తారు.