Tuesday, 24 February 2015

http://vibhaataveechikalu.blogspot.in/2015/02/blog-post.html
విభాత వీచికలు

 ఈ బ్లాగులో , సనాతన ధర్మము నకు సంబంధించిన వివిధ ఆచరణలు , ఇతర విశేషాలు , వివరణలు మాత్రమే ఉంటాయి.

                   Sunday, February 1, 2015 జగద్గురువులు శ్రీ విధుశేఖర భారతి గారి అనుగ్రహ భాషణము

                                     || శ్రీః || ముప్పై యేడవ శ్రీ శారదా పీఠపు జగద్గురువులు శ్రీ విధుశేఖర భారతి గారు సన్యాసాశ్రమము తీసుకున్న తరువాత తమ మొట్ట మొదటి అనుగ్రహ భాషణమునిచ్చినారు. [ కన్నడ భాషణమునకు తెలుగు అనువాదము- పూర్తి పాఠము ] || శారదా శారదాంభోజ వదనా వదనాంబుజే | సర్వదా సర్వదాఽస్మాకం సన్నిధిం సన్నిధిం కుర్యాత్ || || శ్రుతిః స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం | నమామి భగవత్పాదం శంకరం లోక శంకరం || || అజ్ఞానాంజాహ్నవీ తీర్థం విద్యాతీర్థం వివేకినాం | సర్వేషాం సుఖదం తీర్థం భారతీ తీర్థమాశ్రయే || ఈ జగత్తులోనున్న సర్వ ప్రాణులకన్నా మనుష్యుడు అత్యంత శ్రేష్ఠమైనవాడు అని శాస్త్రములు చెపుతాయి. అయితే మనుషులమై పుట్టినంత మాత్రమునకే మనము కృతార్థులము కాలేము. దానిని, అంటే ఆ మనుష్య జన్మను మనము సార్థకము చేసుకోవలెను. మన జీవితానికి సార్థకత అనేది ఎప్పుడు కలుగునంటే , మోక్షమును పొందినపుడు మాత్రమే. మనుషుడై పుట్టినదానికి ఫలమేమిటి అంటే , మోక్షమును పొందుటే ఫలము . కానీ ఆ మోక్షమనేది అంత సులభముగా దొరికేది కాదు. దానికి మహాపురుషుల అనుగ్రహము అనేదొకటుండ వలెను. భగవంతుని కృప అనేది కూడా ఉండవలెను. ఎన్నో జన్మలలో చేసినట్టి పుణ్యము , పుణ్య విశేషమూ ఉండవలెను. అయితే ఈ మహాపురుషుల అనుగ్రహము అనేది అత్యంత దుర్లభమైనది. దీనినే శంకరాచార్యులు అంటారు , || దుర్లభం త్రయమేవైతత్ దైవానుగ్రహ హేతుకం | మనుష్యత్వం , ముముక్షుత్వం , మహాపురుష సంశ్రయః || అని. మనుష్య జన్మ పొందుట , అలాగే , మోక్షమును పొందవలెనన్న తీవ్రమైన ఇఛ్చ ఉండుట , అట్లే , మహాపురుషుల సాన్నిధ్యము-ఇవన్నీ కావలెనంటే , భగవంతుని కృప అనేది మనకు ఉండే తీరవలెను. ఆ కృప ఉండుట వల్లనే మనకు ఈ మూడూ దొరకుతాయి. నాకు , ఆ మహాపురుషుల సంశ్రయము... అంటే సాన్నిధ్యము అనేది ఆ శారదామాత కృప వల్ల దొరికింది. అందులోనూ , మహాపురుషులు అనగా , సాక్షాత్తూ ఆది శంకరుల పరంపరలో వచ్చినట్టి , అలాగే ఆ ఆదిశంకరుల స్వరూపులైనట్టి జగద్గురువుల సాన్నిధ్యము అనేది నాకు లభించింది. వారి అనుగ్రహము నాకు దొరికింది. మొదటినుండీ కూడా నాకు ఆధ్యాత్మిక మార్గములో జీవనము గడపవలెను, నా జీవితాన్ని సార్థకము చేసుకోవలెను అనే ఇఛ్చ ఉండింది. అలాగే , శృంగేరీ జగద్గురువుల వద్దనే శాస్త్రాధ్యయనము చేయవలెను అన్న కోరిక కూడా ఉండేది. దానికై జగద్గురువులను ప్రార్థించినపుడు , వారు నామీద పరమానుగ్రహమును చూపి, న్యాయాది సర్వ శాస్త్రములనూ నాకు నేర్పించినారు. నామీద అపారముగా వారి కృప ఉండింది. వారు ప్రతీ క్షణమూ నా ఉన్నతినే కోరుచుండెడి వారు. ఈ దినము నాకు కలిగిన ఈ గొప్ప భాగ్యములో మాకు సొంతముగా యేదీ రాలేదు , అంతా కూడా ఆ జగద్గురు మహాస్వాముల అనుగ్రహము వల్లనే మాకు దొరికింది. నేనైతే ఇక్కడికి.. ఈ శృంగేరికి వచ్చినది, శాస్త్రాధ్యయనము కోసము మాత్రమే. అట్లే , ఆధ్యాత్మికముగనూ , శాస్త్రోక్తముగానూ జీవితము గడపవలెను అన్న కోరితోనూ వచ్చినాను. అయితే జగద్గురు మహాస్వాములవారు నన్ను పరిపూర్ణముగా అనుగ్రహించి వారి కరకమలములతోనే నాకు సన్యాసాశ్రమమును అనుగ్రహించినారు. తమ ఉత్తరాధికారిగా నన్ను స్వీకరిస్తాను అని వారు చెప్పినపుడు నాకు అవధులులేని ఆనందము కలిగింది. ఎందుకంటే సాక్షాత్తూ ఆ ఆది శంకరుల పరంపరలో వచ్చిన వారు , ఆ ఆదిశంకరుల స్వరూపులే యైనట్టి ఆ జగద్గురువుల అనుగ్రహము నాకు ఇంతగా దొరకడము , ఈ దినము నా జీవితము ధన్యమైనట్లే అని భావిస్తున్నాను. నన్ను తమ ఉత్తరాధికారిగా స్వీకరిస్తున్నామని వారు చెప్పినపుడు నేను అడిగినాను , " తమరు ఇంతటి బాధ్యతను నాపైనుంచినారే , దీనిని వహించుటకు నాకు సాధ్యమవుతుందా ? " అని. దానికి వారు మందహాసముతో అన్నారు , " దాని గురించి నువ్వేమీ ఆలోచించవద్దు , ఆ శారదామాత ప్రేరణతో నీ మీద నా అనుగ్రహము సంపూర్ణముగా ఉంది. అదొక్క దాని వల్లనే సర్వమూ సాధింపబడును " అని అన్నారు. అంటే , గురువుల అనుగ్రహము ఒక్కటీ ఉంటే చాలు , మనము దేనినైనా సాధించవచ్చును , అందులో యే సంశయమూ లేదు అన్నది నాకు బోధ పడింది. వారు నాపై ఇంతటి నమ్మకము , విశ్వాసమూ చూపుట కేవలము వారి అనుగ్రహ కటాక్షమే తప్ప నా గొప్పదనము ఏమీ లేదు. ఇదంతా కూడా ఆ జగద్గురు మహా స్వాములు నాకు అనుగ్రహించి ఇచ్చినదే. అట్లే , నా మీద ఉంచిన ఈ బాధ్యతను కూడా , వారి అనుగ్రహము చేతనే సమంజసముగా నిర్వర్తిస్తాను అని చెప్పతగినది. అలాగే, ఈ మఠపు ఉత్తరోత్తర అభివృద్ధికై కూడా , వారి అనుగ్రహ బలముతోనే నేను పరిశ్రమ చేయగలవాడను. ఇంతటి మహత్కార్యమునకు మీ అందరి సహకారము కూడా అవశ్యముగా కావలెను. మీరందరూ ఇంత సంఖ్యలో ఇక్కడికి వచ్చినారు , ఈ మఠము మీద , గురువుల మీద మీకందరికీ అపారమైన శ్రద్ధ ఉంది, ఈ శ్రద్ధా భక్తులను ఎల్లపుడూ ఇదేరీతిలో కొనసాగిచవలెనని ఈ శుభ సందర్భములో మీకందరికీ నా అభ్యర్థన. ఆ గురుభక్తే మనలను అత్యున్నతమైన స్థితికి తీసుకువెళ్ళగలదు అని చెప్పి , ఆ జగద్గురు చరణారవిందములకు సాష్టాంగ ప్రణామములను అర్పిస్తూ , నా ఈ భాషణమును ముక్తాయిస్తున్నాను. [ కింది భాషణము వారు ముందటి దినము కొన్ని వార్తా పత్రికలకు ఇచ్చినది] || శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోక శంకరం || భగవత్పాద శంకరాచార్యులు , " జంతూనాం నర జన్మ దుర్లభం " అన్నారు. అటువంటి నరజన్మను పొందిన తరువాత , మోక్షమును పొందుటే ముఖ్యమైన ధ్యేయముగా ఉండవలెను. ఆధ్యాత్మ సాధన యొక్క ముఖ్య ఉద్దేశము కూడా అదే అయి ఉన్నది. కాబట్టి ఆధ్యాత్మ సాధనే ప్రతి యొక్కరికీ మొదటినుండీ చివరి వరకూ లక్ష్యముగా ఉండవలెను. మోక్ష మార్గమునకు సన్యాసాశ్రమమే శ్రేష్ఠమైన మార్గము. ఎందుకంటే సన్యాసికి ఎటువంటి బంధనాలూ ఉండవు. ఎట్టి అంతరాయములూ లేక పరమాత్ముని గురించి నిరంతరమూ ధ్యానము చేయుటకు అవకాశముంటుంది. అందువలన , సన్యాసమే ఉత్తమ మార్గమని నా భావన. గృహస్థాశ్రమములో ఆ అవకాశము లేదు. గృహస్థులకు కుటుంబ నిర్వహణా బాధ్యతలుంటాయి కాబట్టి సంపూర్ణముగా ఆధ్యాత్మ సాధనలో నిమగ్నమగుట సులభము కాదు. సన్యాసాశ్రమము తీసుకున్ననూ మోక్షమును పొందాలంటే గురువు యొక్క అనుగ్రహము అత్యంత అవసరమైనది. శంకరాచార్యులే వారి శిష్యులకు మహా వాక్యమును ఉపదేశము చేసినారు. ఇది పరంపరానుగతముగా వస్తున్నది. అటువంటి పరంపరలో వచ్చిన గురువులే నాకు సాక్షాత్తూ ఉపదేశము అనుగ్రహించుట , నా జీవితములో నేను పొందిన అతిపెద్ద సౌభాగ్యము . శ్రీ జగద్గురువులు నన్ను అనుగ్రహించుటలో నా గొప్పతనమేదీ లేదు. అది కేవలము వారి దయ. అట్టి గురువుల వద్ద శిష్యరికము చేయుట నా భాగ్యము. ఇది నేనేనాడూ ఊహించనిది. ఆరు సంవత్సరాల క్రిందట , శృంగేరికి వచ్చినపుడు , శాస్త్రాధ్యయనము చేయుట మాత్రమే నా ఉద్దేశము. అపుడు ఇంతపెద్ద బాధ్యత నాకు వస్తుందనీ , దానిని నేను తీసుకోవాలనీ అనుకోలేదు , కోరుకోలేదు. అయితే గురువుల సాన్నిధ్యము , వారి విశేషమైన అనుగ్రహము మరియూ వారు చూపిన మార్గ దర్శనము నన్ను మూక విస్మితుడిని చేసింది. వారు నాపై ఉంచిన నమ్మకము , బాధ్యతలను దైవానుగ్రహముగాను , దైవాదేశముగానూ తీసుకుంటాను. వారి అనుజ్ఞను పాలించుతున్నాను అన్న ఆత్మతృప్తి , సంతోషమూ నాకున్నాయి. గురుపాదుకాభ్యో నమః