మన ప్రాచీన ధర్మగ్రంథాలు, పురాణాలు తులసి గొప్పదనాన్ని వేనోళ్ళ కీర్తించాయి. తులసి మొక్కలు నాటడం వాటిని సంరక్షించడం వల్ల సకల శుభాలూ కలుగుతాయని ’స్కాందపురాణం’ చెబుతోంది. తులసీ వనం ఎక్కడ ఉంటే, అది పుణ్యస్థలం లాంటిదని ’పద్మపురాణం’ పేర్కొంటోంది. ఆ ఇంటిలోకి యమభటులు ప్రవేశించలేరని స్పష్టం చేస్తోంది.
తులస్యారోపితాసిక్తా దృష్టాస్స్పృష్టాచ పాలితా!
ఆరోపితా ప్రయత్నేన చతుర్వర్గ ఫలప్రదా!!
తులసి మొక్కను భక్తితో నాటినా, నీటితో తడిపినా, చూసినా, తాకినా, పోషించినా, వనం ఏర్పరచినా - ధర్మార్థకామమోక్షాలనే చతుర్విధ ఫలితాలూ కలుగుతాయి.
ఒక్క తులసిని పెంచినా అక్కడ బ్రహ్మ విష్ణుమహేశ్వరులు, ఇతర దేవతలు ఆవాసం చేస్తారని అంటారు. అలాగే, అక్కడ గంగాది పుష్కర తీర్థాలన్నిటినీ సేవించిన ఫలితం దక్కుతుంది. తులసీ మాతను ప్రార్థించం వల్ల దేవతలందరినీ ప్రార్థించినట్లు అవుతుంది. తీర్థయాత్ర చేసిన ఫలం లభిస్తుంది.
తులసీ కాననం యత్ర యత్ర పద్మవనానిచ!
సాలగ్రామ శిలా తత్ర తత్ర సన్నిహితో హరిః!!
తులసి వనం ఉన్న చోటా, పద్మాలున్న తావులో, సాలగ్రామం ఉన్న ప్రదేశంలో శ్రీమహావిష్ణువు తప్పనిసరిగా ఉంటాడు. దీనిని బట్టి తులసిమొక్కకు ఉన్న ప్రాధాన్యం ఏమిటో గ్రహించవచ్చు.