Monday, 18 July 2011

విభూతి

సకల దోషాలు తొలగి, సర్వపాపాలూ పటాపంచలు కావాలన్నా, సంపూర్ణ ఆయురారోగ్యాలు, సిరిసంపదలు లభించాలన్నా ప్రతిరోజూ విభూతిని ధరించడమే ఏకైక మార్గమని శాస్తవ్రచనం. రోజూ పూజలు చేయలేనివారు, ఆలయ సందర్శన చేయలేనివారు ప్రతినిత్యం నుదుటన విభూది ధరిస్తే చాలు- సహస్రనామాలతో స్వామిని పూజించి, నిత్యం ఆలయదర్శనం చేసుకుంటున్నంత ఫలాన్ని పొందుతారు. అంతటి శక్తిమంతమైన విభూతిని ధరించిన వారి భవిష్యత్తు ఉజ్వలంగా ప్రకాశిస్తుందని, అసలు విభూతినే ధరించని వారికి భవిష్యత్తు లేదని పురాణ కథనం 


మృత్యుంజయ మంత్రం: ఓం త్య్రంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనమ్
ఉర్వారుక మివబంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్

విభూతి అంటే ధనము, బలము, మహిమ, లీల, మహాత్మ్యం అనే అర్థాలున్నాయి. విభూతి ధరిస్తే సకల శారీరక, మానసిక రోగాలు తొలగిపోయి, పరిపూర్ణ ఐశ్వర్యం సిద్ధిస్తుంది.

పవిత్రమైన విభూతిని ఎలా ధరించాలో, ఏ అంగాలలో ధరిస్తే ఏయే ఫలితాలు సిద్ధిస్తాయో చూద్దాం. ఫాలభాగం- పీకలవరకు చేసిన పాపాలు తొలగుతాయి. వక్షస్థలం-మనస్సుతో తెలిసి చేసిన పాపం నశిస్తుంది. నాభి- కడుపు దాకా చేసిన పాప నిర్మూలన జరుగుతుంది. భుజాలు- చేతితో చేసిన పాపం నశిస్తుంది. మోకాళ్లు-కాళ్లతో చేసిన పాపం పరిహరింపబడుతుంది.

విభూతి ఎలా ధరించాలి?
విభూతిని ధరించేటప్పుడు మూడువేళ్లతో తీసుకుని తొలుత ఫాలభాగాన ధరించి, ఆ పై భుజాలకు, ఆపై చేతులకు ఆ తర్వాత హృదయం, ఉదరం... ఇలా క్రమంగా ధరించాలి. ధరించిన వస్త్రాలపైన, నేలపైన పడకుండా జాగ్రత్తగా ధరించాలి. పొరపాటున నేలపైన పడితే వస్త్రంతో తీయాలే తప్ప చీపురుతో చిమ్మరాదు. స్ర్తీల చేతికి ఇవ్వరాదు. ఒకవేళ స్ర్తీలు ధరించాల్సి వస్తే వారే తీసుకుని ధరించాలి. ఈశ్వర సన్నిధికి, హోమగుండానికి అభిముఖంగా నిలబడి ధరించరాదు.

విభూతిని మూడు గీతలుగా పెట్టుకుంటే సత్వరజస్తమోగుణాలకు అతీతులని అర్థం. తలస్నానం చేసినప్పుడు తడి విభూతి, కంఠస్నానం చేసినప్పుడు పొడి విభూతీ పెట్టుకోవాలి. విభూతిని ముందుగా కుడినుంచి ఎడమకు బొటనవేలితో పెట్టుకుని తరవాత మధ్యవేలితో సరిచేసుకోవాలి. బొట్టు పెట్టుకునేటప్పుడు మధ్యవేలితోనే పెట్టుకోవాలి తప్పితే చూపుడు వేలితో పెట్టుకోరాదు. విభూతిని ధరించేటప్పుడు ఈ కింది శ్లోకం పఠించడం వల్ల మరింత ఉత్తమ ఫలితాలు కలుగుతాయి.
శ్రీకరంచ పవిత్రంచ శోక రోగనివారణం
లోకే వశీకరణం పుంసాం భస్మం త్రైలోక్యపావనమ్

బిల్వవృక్షం
బిల్వవృక్షాన్ని తెలుగులో మారేడు చెట్టు అంటారు. పరమశివునికి ప్రీతికరమైనది మారేడు దళం. ఈశ్వరుడికి ఎన్నో రకాల పూలు, పండ్లు, నైవేద్యాలు సమర్పించినా, వాటిలో మారేడుదళం లేకపోతే ఆ పూజ సంపూర్ణం కానట్లే! ఎందుకంటే వెయ్యి యజ్ఞాలు చేసిన ఫలం, కోటిమంది కన్యలను దానం చేసిన ఫలం, నూరు గోవులను దానం చేసిన ఫలం ఒక్క బిల్వదళం సమర్పించడం వల్ల వచ్చే ఫలం కన్నా స్వల్పం!. చెంబెడు నీటిని నెత్తిన పోసి, ఒక్క మారేడు దళాన్ని భక్తితో సమర్పిస్తే చాలు, ఆ పరమశివుడు ఆనందంతో తబ్బిబ్బై ఇంటి ముంగిట కల్పవృక్షాన్ని పాతి, కామధేనువును పెరట్లో కట్టేసి వెళతాడట.

బిల్వవృక్షం సాక్షాత్తూ శ్రీ మహాలక్ష్మి హృదయం నుంచి ఉద్భవించిందని పురాణాలు పేర్కొంటున్నాయి. బిల్వదళాలు త్రిశూలాకారంలో ఉండి, ఆ త్రినేత్రుని మూడు కన్నుల్లా, ఓంకారానికి ప్రతీకగా భాసిస్తాయి. శివపార్వతులను బిల్వపత్రాలతో పూజించిన వారికి సకల సిద్ధులు కలుగుతాయని పురాణోక్తి. బిల్వవృక్షాన్ని చూసినా, తాకినా, గాలి పీల్చినా మనస్సు, శరీరం పవిత్రమవుతాయి. పరమేశ్వరునికి అత్యంత ప్రీతికరమైన బిల్వవృక్షం కింద శివలింగాన్ని ఉంచి పూజిస్తే సకల పాపాలూ పటాపంచలవుతాయని ప్రతీతి. దీర్ఘరోగాలతోనూ, దుష్టగ్రహాలతోనూ పీడించబడుతున్నవారు, అపమృత్యుదోషం కలవారు మృత్యుంజయ మంత్రాన్ని జపిస్తూ బిల్వదళాలతో ఈశ్వరుని అర్చిస్త్తే అన్ని అరిష్టాలూ తొలగిపోతాయని పురాణోక్తి.

జ్ఞానానికి సంకేతం
మలిసంధ్య నుంచి తొలి సంధ్య దాటే వరకు ఏ ఇంటిలో దీపం వెలిగితే ఆ ఇంటిలో శ్రీ మహాలక్ష్మి కొలువై ఉంటుందన్నది పురాణోక్తి. సృష్టి, స్థితి, లయలు మూడింటిలోనూ దీపానికి ప్రముఖ స్థానం ఉంది. భగవంతునికి భక్తులు సమర్పించే షోడశోపచారాలలో దీపసమర్పణ కూడా ఒకటి.

గృహంలో కూడా దీపాన్ని వెలిగించిన తరువాత దేవతార్చన ప్రారంభించడం సంప్రదాయం. జ్యోతిస్వరూపమైన ఈ దీపం సిద్ధి శక్తులను ప్రసాదిస్తుంది